ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత కర్ణాటకలో తమ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ రోజు ఆయన కర్ణాటకలో ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించారు.

బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్ తర్వాత ఆప్ తమ మూడో ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఆయన ఈ రోజు కర్ణాటకలో క్యాంపెయిన్ ప్రారంభిస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కాలేజీ గ్రౌండ్‌లో ర్యాలీని ఉద్దేశిస్తూ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. రాష్ట్రంలోని 40 శాతం ప్రభుత్వాన్ని కూల్చేయాలని, ఇందుకు రైతు సంఘాల మద్దతు అవసరం అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన అవినీతి ఆరోపణలను పరోక్షంగా ఉటంకిస్తూ ఆయన 40 శాతం ప్రభుత్వం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి 40 శాతం కమీషన్లు ఇవ్వాల్సి వస్తున్నదని ఇటీవలే కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రభుత్వానికి చెందిన 20 శాతం నుంచి 40 శాతం కమీషన్ల ఖాతాలను మూసేయాలని కేజ్రీవాల్ చెప్పారు. అవినీతి రహిత ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఎన్నో సేవలు అందించవచ్చునని వివరించారు. గత ఐదేళ్లుగా అనేక ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొన్నా తాము ఢిల్లీ ప్రజలకు మాత్రం ఐదు రకాల సేవలను ఉచితంగా అందించగలిగామని తెలిపారు. విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీరు, మహిళలకు రవాణా సేవలను తాము ఉచితంగా అందించగలిగామని వివరించారు. ఇదంతా తాము ఎలా చేస్తున్నామని ప్రశ్నించారు. ఎలాగంటే.. నిజాయితీగా పాలించి అని తెలిపారు. నిజాయితీగా పాలించి తాము డబ్బు ఆదా చేస్తున్నామని పేర్కొన్నారు. 

ఇదే సందర్భంలో ఆయన లఖింపూర్ ఖేరి హింస, ఆయన ఇంటిపై దాడిని గుర్తు చేశారు. కొన్ని రోజులుగా ఈ ఘటనలు తనను వేధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ గూండాలు ఒక పార్టీలో చేరుతారని తెలిపారు. ఈ గూండాలు అంతా అదే పార్టీకి చేరుతారని వివరించారు. దీనికి సభకు హాజరైనవారు బీజేపీ అని అరిచారు.

బీజేపీ మాత్రమే రేపిస్టులు, గూండాలు వారి గూటికే చేరుతారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా, ఆప్ అలా కాదని, తమ పార్టీ జెంటిల్‌మెన్, దేశభక్తులు, నిజాయితీపరుల పార్టీ అని వివరించారు. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న అల్లర్లను ప్రస్తావించారు. ప్రజలు శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నారని తెలిపారు. మీకు అల్లర్లు, ఘర్షణలు కావాలంటే వారికే ఓటు వేయండి అంటూ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఒక వేళ మీకు స్కూల్స్ కావాలంటే తమకు ఓటు వేయాలని వివరించారు.

ఈ ర్యాలీలో రైతు నేత కొడిహళ్లి చంద్రశేఖర్ ఆప్‌లో జాయిన్ అయ్యారు. కర్ణాటక రాజ్య రైత సంఘనే వచ్చే ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తున్నదని వివరించారు. ఇదే నెల మొదట్లో బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావు కూడా ఆప్ తీర్థం పుచ్చుకున్నారు.