మహారాష్ట్రలోని బంద్రాలో ఉన్న ఓ రెస్టారెంట్ లో సర్వ్ చేసిన చికెన్ కర్రీలో ఎలుక వచ్చింది. దీంతో కస్టమర్ ఆ రెస్టారెంట్ సిబ్బందిపై మండిపడ్డాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ రెస్టారెంట్ మేనేజర్, కుక్ ను అరెస్టు చేశారు.

తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లిన ఓ బ్యాంక్ మేనేజర్ కు ఓ వింత అనుభవం ఎదురైంది. వారికి సర్వ్ చేసిన చికెన్ కర్రీలో చనిపోయిన ఎలుక వచ్చింది. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ హోటల్ మేనేజర్ ను, కుక్ ను అరెస్టు చేశాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బాంద్రాలో ఓ ప్రముఖ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కు గోరేగావ్ వెస్ట్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న దిండోషి ప్రాంతానికి చెందిన అనురాగ్ దిలీప్ సింగ్, తన స్నేహితుడు అమీన్ ఖాన్ (40)తో కలిసి ఆగస్టు 13న డిన్నర్ కోసం వెళ్లాడు. అయితే వీరు భునా గోష్ట్, చికెన్ కర్రీని ఆర్డర్ చేశారు.

Scroll to load tweet…

ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ తింటున్నారు. ఈ క్రమంలో దిలీప్ సింగ్ తాను తింటున్న చికెన్ కర్రీలో ఒక అసాధారణ ముక్కను కనుగొన్నాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అది చనిపోయిన ఎలుక అని తెలుసుకుని షాకయ్యాడు. దీంతో సిబ్బందిని పిలిచి ప్రశ్నించారు. ఆ సమయంలో హోటల్ మేనేజర్ వివియన్ ఆల్బర్ట్ సిక్విరా అక్కడ అందుబాటులో లేడు. దీంతో ఆయనకు ఫోన్ చేసి, ఎలుకను చూపించారు. ఆయన వారికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. 

దీంతో తనకు ఆ రెస్టారెంట్ లో ఎదురైన అనుభవాన్ని అనురాగ్ దిలీప్ సింగ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. చికెన్ కర్రీలో ఎలుక ఫొటోలను పోస్టు చేశారు. దానిని ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు. ‘‘పాలి నాకా బాంద్రా వెస్ట్ సమీపంలోని పాపా పంచోదాబా వద్ద మా గ్రేవీలో ఎలుక కనిపించింది. మేనేజర్, ఓనర్ మా మాటలను వినడానికి సిద్దంగా లేరు. పోలీసులతో పాటు మరో 100 మందిని కూడా పిలిచాం. కానీ మాకు ఇంకా సహాయం అందలేదు’’ అని ట్వీట్ చేశారు. 

అనంతరం అనురాగ్ దిలీప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తెల్లవారుజామున మేనేజర్, కుక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం వారిద్దరినీ అరెస్టు చేశారు. కాగా.. వారు ఆర్డర్ చేసిన చికెన్ కర్రీ, అందులో ఎలుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.