వందే భారత్ రైళ్లకు ఆరెంజ్ కలర్.. దీని వెనక రాజకీయ కారణముందా ? కేంద్ర రైల్వే మంత్రి ఏం చెప్పారంటే ?
వందే భారత్ రైళ్లకు ఆరెంజ్ కలర్ వేయడం వెనక ఎలాంటి రాజకీయ కోణమూ లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఆరెంజ్ కలర్ మానవుల కళ్లకు ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. శాస్త్రీయ ఆలోచనతోనే ఈ రంగు వేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
వందే భారత్ రైళ్లు ప్రయాణికుల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. వీటిలో సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం ఎందరినో ఆకర్శిస్తోంది. అందుకే కేంద్ర రైల్వే శాఖ మరిన్ని రూట్లలో ఈ రైళ్లను ప్రవేశపెడుతోంది. మరిన్ని వందే భారత్ రైళ్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే కొత్తగా తయారయ్యే రైళ్లు తెలుపు, నీలం రంగులో కాకుండా కొన్ని ఆరెంజ్, గ్రే కలర్ తో మిళితమై ఉంటున్నాయి. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాజకీయ కోణం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ స్పందించారు. ఆరెంజ్ కలర్ వందే భారత్ రైళ్లను ప్రారంభించడం వెనక ఉద్దేశం ఏమిటని మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. కొత్త రైళ్ల కలర్ వెనుక ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. శాస్త్రీయ ఆలోచన వల్లే ఈ రంగును ఎంపిక చేశామని తెలిపారు.
‘‘మానవ కళ్ళకు రెండు రంగులు ఎక్కువగా కనిపిస్తాయి. అందులో ఒకటి పసుపు మరొకటి నారింజ. అందుకే ఐరోపాలో దాదాపు 80 శాతం రైళ్లు నారింజ లేదా పసుపు, నారింజ కలయికను కలిగి ఉంటాయి’’ అని వైష్ణవ్ తెలిపారు. వెండి వంటి అనేక ఇతర రంగులు పసుపు, నారింజ వంటివి ప్రకాశవంతంగా ఉన్నాయని, కానీ మానవ కంటికి కనిపించే కోణంలో మాట్లాడితే ఈ రెండు రంగులు (నారింజ, పసుపు) ఉత్తమమైనవిగా పరిగణలోకి వస్తాయని చెప్పారు.
దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదని, ఇది నూటికి నూరు శాతం శాస్త్రీయ ఆలోచన అని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ కారణాల వల్లనే విమానాలు, ఓడల్లోని బ్లాక్ బాక్సులు నారింజ రంగులో ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉపయోగించే రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు కూడా ఆరెంజ్ రంగులో ఉంటాయని అన్నారు.
కాగా.. భారతీయ రైల్వే తన మొదటి ఆరెంజ్-గ్రే కలర్ వందే భారత్ రైలును సెప్టెంబర్ 24 న కేరళలోని కాసర్గోడ్, తిరువనంతపురం మధ్య ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్ లో జెండా ఊపి ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ రైళ్లలో ఇది ఒకటి. కాసరగోడ్-తిరువనంతపురం 31వ వందేభారత్ రైలు తమిళనాడులోని చెన్నై, పెరంబూరులో రైలు బోగీల తయారీ సంస్థ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు అయ్యింది. ఆగస్టు 19న ట్రయల్ రన్ కోసం పట్టాలను దాటింది.