జాతీయవాదం, పార్టీ సిద్ధాంతాలు పట్ల బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలో పార్టీలకతీతంగా ప్రతిపక్షాలు అద్వానీకి మద్ధతు పలుకుతున్నాయి. బీజేపీని ఉన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప నేతలను సొంత పార్టీనే మర్చిపోవడం బాధాకరమంటూ మోడీ, అమిత్ షాలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

సీనియర్ రాజకీయ నాయకుడిగా, మాజీ ఉప ప్రధానిగా, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడిగా ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య ఉండే మర్యాదలపై అద్వానీ చేసిన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఉందన్నారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆయన వ్యాఖ్యల్ని తామంతా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు.

మరోవైపు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందిస్తూ.. ఉన్నత విలువలు, రాజనీతి కలిగిన గొప్ప నేతలను ఆదర్శంగా తీసుకోవాలని కానీ.. పట్టించుకోకుండా ఉండొద్దని.. వారి సూచనలకు విలువ ఇవ్వకపోవడమంటే వారిని అవమానించడమేనని వాద్రా అభిప్రాయపడ్డారు.

అద్వానీ బీజేపీకి మూలస్తంభం లాంటివారని.. కానీ సొంత పార్టీనే ఆయనను మరిచిపోవడం బాధాకరమన్నారు. మోడీ జీ మీ ఢిల్లీ ప్రయాణంలో సాయం చేసిన వ్యక్తి చెప్పే మాటలు వినండి అంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు.