పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన గురువారం ఉదయం పలు ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 10కి పైగా విపక్ష  పార్టీలు హాజరయ్యాయి. ఇందులో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఉండటం విశేషం. 

పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన గురువారం ఉదయం పలు ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 10కి పైగా విపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఇందులో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఉండటం విశేషం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న విపక్షాలకు టీఆర్ఎస్ పార్టీ హాజరుకావడం ఇదే తొలిసారి. ఇక, ప్రతిపక్ష నేత కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఐయుఎంఎల్, ఎన్‌సీ, టీఆర్ఎస్, ఎన్‌సీపీ, శివసేన, ఆర్‌జేడీ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. ఈ సమావేశానికి గైర్హాజరైన ప్రధాన ప్రతిపక్షాలలో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి. 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచిన రోజున ఈ సమావేశం జరగడం గమనార్హం. ఈ సమావేశం అనంతరం విపక్ష పార్టీలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆ ప్రకటనలో ఆరోపించాయి. ప్రజా వ్యతిరేక మోదీ సర్కార్‌పై పోరాటాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించాయి. 

ఇక, ఇప్పటికే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడంపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈరోజు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

అయితే చాలా కాలంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ పార్టీతో వేదిక పంచుకోవడానికి అయిష్టత వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయితే విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయించేందుకు మమతా నిర్ణయించిన సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడం ఇష్టంలేకనే తమ పార్టీ ఈ సమావేశానికి వెళ్లలేదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత శరద్ పవార్ చెప్పడంతో.. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతును ప్రకటించింది. 

అయితే ఇప్పుడు విపక్షాల నిరనల్లో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు.. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగానే చెప్పాలి. బుధవారం పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, జీఎస్‌టీ పెంపునకు వ్యతిరేకంగా పలు ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. ఈ నిరసనల్లో కాంగ్రెస్‌తో కలిసి టీఆర్ఎస్ కూడా పాల్గొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పక్కనే టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఉన్నారు. ఇక, గురువారం జరిగిన విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు.. కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావులు హాజరయ్యారు.