బీజేపీకి వ్యతిరేకంగా పలు విపక్ష పార్టీలు గత నెలలో పాట్నాలో సమావేశమైన వివిధ అంశాలపై చర్చించాయి. తదుపరి చర్చల కోసం బెంగళూరులో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ సమావేశం వాయిదా పడింది.
బీజేపీకి వ్యతిరేకంగా పలు విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత నెలలో పాట్నాలో సమావేశమైన పలు ప్రతిపక్ష పార్టీలు వివిధ అంశాలపై చర్చించాయి. తదుపరి చర్చల కోసం ప్రతిపక్షాల సమావేశాన్ని జూలై 10 లేదా 12న సిమ్లాలో నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. ఆ సమావేశ వేదికను బెంగళూరుకు షిప్ట్ చేస్తున్నట్టుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. బెంగళూరులో జూలై 13, 14 తేదీల్లో విపక్షాల మీటింగ్ ఉంటుందని ఆయన చెప్పారు.
అయితే బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఈ మేరకు జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాల తర్వాత ప్రతిపక్షాల పార్టీల తదుపరి సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం (జూలై 1) తెలిపారు.
అయితే ప్రతిపక్షాల సమావేశానికి మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. జూలై నెలలో బీహార్, కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. బీహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై 10-24 తేదీల్లో జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాను, నితీష్ కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా గడపాల్సి ఉన్నందున.. ప్రతిపక్షాల సమావేశాన్ని వాయిదా వేయాలని జేడీయూ అధినేత నితీష్ కుమార్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాల నేపథ్యంలో.. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకత్వం కూడా ప్రతిపక్షాల సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా విపక్షాల భేటీకి కారణమనే ప్రచారం వినిపిస్తోంది.
