న్యూఢిల్లీ: రైతుల సమస్యలను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగానే ఉందని రాజ్యసభలో బీజేపీ ప్రకటించింది.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలపై జరిగిన చర్చల్లో బీజేపీ సభ్యులు భువనేశ్వర్ కలితా ప్రసంగించారు. రైతులపై ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని ఆయన చెప్పారు.

చట్టాల ద్వారా రైతులకు మరిన్ని హక్కులు కల్పించిందని ఆయన గుర్తు చేశారు. రైతుల సమస్యల పేరుతో విపక్షాలు రాజ్యసభ కార్యక్రమాలకు ఆటకం కల్పిస్తున్నాయని ఆరోపించారు.ఉభయ సభల్లో సుధీర్ఘమైన చర్చ జరిపిన తర్వాతే కొత్త వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు. రైతు ఉద్యమాన్ని మరో షాహీన్‌బాగ్ గా మార్చొద్దని  ఎంపీ విపక్షాలను కోరారు.

also read:ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో ధ్వంసం: విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ల కొట్టివేసిన సుప్రీం

రైతు సంఘాల నేతల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగానే ఉందని ఆయన ప్రకటించారు. ఇప్పటికే పలు దఫాలు రైతు సంఘాల నేతలతో చర్చించినట్టుగా గుర్తు చేశారు.రైతుల సమస్యలపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం, విపక్షాల మధ్య  అంగీకారం కుదిరింది.