Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్ ఆక్టోపస్ 2.0: ఎన్ఐఏ అదుపులోకి 170 మంది పీఎఫ్ఐ సభ్యులు

PFI: కేంద్ర దర్యాప్తు సంస్థ  ఎన్ఐఏ మ‌రోసారి ఎనిమిది రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యాల‌యాలు, సంబంధిత వ్య‌క్తుల ఇండ్ల‌పై దాడులు నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలోనే 170 మంది పీఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకుంది. 
 

Operation Octopus 2.0: NIA detains 170 PFI activists
Author
First Published Sep 27, 2022, 2:46 PM IST

Operation Octopus 2.0: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) అగ్ర నాయ‌కులు,  కార్యకర్తలు, సిబ్బందికి సంబంధించి ప్రాంతాల్లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మ‌రోసారి దాడులు నిర్వ‌హించింది. ఇప్ప‌టికే ఆ సంస్థ చీఫ్ ల‌ను అదుపులోకి తీసుకోగా, తాజా దాడుల్లో పీఎఫ్ఐకి చెందిన దాదాపు 170 మందిని అదుపులోకి తీసుకుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) మంగళవారం ఎనిమిది రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో రెండవ రౌండ్ దాడులను ప్రారంభించింది. 

కాగా, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై ఆపరేషన్‌ ఆక్టోపస్‌ కింద ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి పీఎఫ్‌ఐ సభ్యులపై దాడులు నిర్వహిస్తోంది. మంగళవారం ఢిల్లీ, కర్ణాటక, అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. ఈ ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల 170 మందికి పైగా పీఎఫ్ఐ సభ్యులను ద‌ర్యాప్తు సంస్థ‌లు అదుపులోకి తీసుకున్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి. 

పీఎఫ్ఐ విష‌యంలో ఎన్ఐఏ దాడుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

  • ఢిల్లీలోని షాహీన్‌బాగ్, నిజాముద్దీన్, జామియా నగర్‌లలో దాడులు జరిగాయి. దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సంస్థలతో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్థానిక పోలీస్ స్టేషన్ల బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నవంబర్ 17 వరకు జామియా నగర్‌లో సీఆర్పీసీ సెక్షన్ 144 విధించారు. 
  • కర్ణాటకలో 75 మంది పీఎఫ్ఐ సభ్యులను 'ప్రివెంటివ్ కస్టడీ' కింద అదుపులోకి తీసుకున్నారు. బీదర్, మంగళూరు, కోలార్, విజయపుర, బాగల్‌కోట్, చిత్రదుర్గ, బళ్లారి, చామరాజనగర్‌లో దాడులు నిర్వహించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పీఎఫ్‌ఐ జిల్లా వాసి అబ్దుల్ కరీం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) సెక్రటరీ షేక్ మస్క్సూద్ ఉన్నారు.
  • అసోంలో గోల్‌పరా, కమ్‌రూప్, బార్‌పేట, ధుబ్రి, బాగ్సా, దర్రాంగ్, ఉదల్‌గురి, కరీంగంజ్ జిల్లాల్లో దాడులు కొన‌సాగాయి. మొత్తం 25 మంది పీఎఫ్ఐ స‌భ్యుల‌ను అదుపులోకి తీసుకున్నారు. 
  • మహారాష్ట్రలో ఉగ్ర‌కార్య‌క‌లాపాల‌కు నిధుల మ‌ళ్లింపు ఆరోప‌ణ‌ల క్ర‌మంలో పోలీసులు పూణేలో ఆరుగురు పీఎఫ్ఐ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పీఎఫ్‌ఐ సభ్యులను ముంబ్రా నుండి అరెస్టు చేయగా, ఒక్కొక్కరిని భివాండి, కళ్యాణ్  ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. 
  • గుజరాత్‌లో, రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS), ఎన్ఐఏ సంయుక్త బృందం కనీసం 10 మందిని ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకుంది.
  • మధ్యప్రదేశ్‌లో, రాష్ట్ర పోలీసుల యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) దాడులు నిర్వహించి 21 మంది పీఎఫ్ఐ  సభ్యులను అరెస్టు చేసింది. గతంలో ఎన్‌ఐఏ దాడుల్లో అరెస్టయిన వ్యక్తులను ప్రశ్నించిన తర్వాత వీరిని అదుపులోకి తీసుకున్నారు.
  • ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, బక్షి తలాబ్, ఇతౌంజా నుండి పీఎఫ్ఐతో సంబంధం క‌లిగిన 10 మందిని ద‌ర్యాప్తు సంస్థ‌లు అదుపులోకి తీసుకున్నాయి.

సెప్టెంబర్ 22న, ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, అసోం, మ‌ధ్య‌ప్ర‌దేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, మణిపూర్ వంటి 15 రాష్ట్రాల్లోని 93 ప్రదేశాలలో పీఎఫ్ఐ కేసు నేప‌థ్యంలో సోదాలు నిర్వ‌హించాయి. వివిధ కేసుల్లో కనీసం 106 మంది పీఎఫ్ఐ సభ్యులు, దానితో సంబంధ క‌లిగిన అనుచ‌రుల‌ను ఈడీ, ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసు సంయుక్త బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios