బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని నరేంద్రమోడీకి వీరాభిమానని తెలిపారు. తన గుండె చీలిస్తే మోడీయే ఉంటారని పాశ్వాన్ అన్నారు.

బీజేపీతో కలిసి బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయటమే తనకున్న ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకుల మాటలు  తనను బాధిస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోయినా ఎన్నికల్లో విజయం సాధించగల సత్తా తమకు ఉందని చిరాగ్ స్పష్టం చేశారు.

మోడీ రాముడైతే.. తాను హనుమంతుడి లాంటివాడినని, ఆయన ఆశీసులు తనకు ఎప్పుడూ ఉంటాయంటూ యువనేత వ్యాఖ్యానించారు. సీఎం నితీశ్‌ జీకే ఆయన ఫొటోల అవసరం ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. 

కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ.. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీచేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కలిసి పోటీచేస్తుండగా.. నవంబర్‌ 10న ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో బీజేపీతో కలిసి ఎల్జేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చిరాగ్ జోస్యం చెప్పారు.

అంతకుముందు బీహార్‌లో సీఎంగా నితీశ్‌కుమార్‌ను ఎల్జేపీ వ్యతిరేకిస్తే.. అమిత్ షా, మోడీలను వ్యతిరేకించినట్టేనంటూ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోడీ వ్యాఖ్యానించడంతో చిరాగ్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు.