కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చిన్న కూతురు అచ్చు ఊమెన్ పోలీసులను ఆశ్రయించారు.

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చిన్న కూతురు అచ్చు ఊమెన్ పోలీసులను ఆశ్రయించారు. తనపై సైబర్ అటాక్ జరిగిందని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువనంతపురంకు చెందిన ఒక వ్యక్తి అతని ఫేస్‌బుక్ అకౌంట్‌లో తనకు పరువు నష్టం కలిగించే విధంగా పోస్ట్ చేశాడంటూ అచ్చు ఊమెన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందుతుడు.. అచ్చు ఊమెన్, ఆమె తండ్రి ఊమెన్ చాందీలపై అవాస్తమైన, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అపకీర్తి కలిగించేలా సందేశాన్ని వ్యాప్తి చేయాలనే దురుద్దేశపూరిత ఉద్దేశ్యంతో ఆ పోస్టు చేయబడిందని పేర్కొన్నారు. 

పుతుపల్లి ఉపఎన్నిక సమీపిస్తున్న సందర్భంలో తనపై సైబర్‌ అటాక్‌లు జరుగుతున్నాయని అచ్చు ఊమెన్ విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి, ద్రవ్యోల్బణం సమస్యల నుండి దృష్టిని మరల్చేందుకు ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాను కొన్నేళ్లుగా ఫ్యాషన్, ట్రావెల్ సెక్టార్‌లో కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్నానని.. తన ఉద్యోగంలో భాగంగా తీసిన ఫోటోగ్రాఫ్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన తండ్రి ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశ్యంతో స్వార్థ ప్రయోజనాలతో దుర్వినియోగం చేశారని ఆమె అన్నారు.

ఇక, గత నెలలో మాజీ సీఎం ఊమెన్ చాందీ మరణంతో పుతుపల్లిలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నిక బరిలో ఏడుగురు అభ్యర్థులు నిలిచారు. పుతుపల్లిలో కాంగ్రెస్-యుడిఎఫ్ అభ్యర్థిగా అచ్చు ఊమెన్ సోదరుడు చాందీ ఊమెన్ ఉన్నారు. అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ తరఫున డీవైఎఫ్‌ఐ నేత జైక్‌ సీ థామస్‌ పోటీ చేస్తున్నారు. బీజేపీ కొట్టాయం జిల్లా అధ్యక్షుడు జి లిజిన్‌లాల్‌ను బరిలోకి దించింది.