చెన్నై: ఆన్‌లైన్ లో గ్యాంబ్లింగ్ కు అనుకూలంగా వాణిజ్య ప్రకటనల్లో నటించిన  సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను నిషేధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది. ఈ తరుణంలో మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ లో వందలాది మంది డబ్బులు పోగొట్టుకొన్నారని పిటిషనర్ ఆరోపించారు. లాక్ డౌన్ సమయంలోనే సుమారు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని పిటిషనర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు మద్దతుగా వాణిజ్య ప్రకటనల్లో నటించవద్దని సెలబ్రెటీలను కోరినా కూడ పట్టించుకోలేదనే విమర్శలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వాణిజ్య ప్రకటనల్లో నటించిన వారికి కోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.

క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సౌరబ్ గంగూలీ, సినీ నటులు తమన్నా, ప్రకాష్ రాజ్, సుదీప్, రానా దగ్గుబాటి లకు కోర్టు నోటీసులు పంపింది. అభిమానులను ప్రభావితం చేసే సెలబ్రిటీలు ఈ రకమైన వాణిజ్య ప్రకటనల్లో నటించడంపై కోర్టు ప్రశ్నించింది.

ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందనే విషయమై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 19వ తేదీ లోపుగా తమ సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది.