కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి తాను ధరించిన జీన్స్ ప్యాంట్‌‌ను రెండు పొరలుగా ఏర్పాటుచేసుకుని అందులో పెయింట్ తరహాలో పూసుకున్నారు. రూ. 14 లక్షల విలువైన 302 గ్రాముల బంగారాన్ని ఆయన అక్రమంగా దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తిరువనంతపురం: మాదక ద్రవ్యాలు, బంగారం, ఇతర విలువైన వస్తువులను అక్రమంగా దేశంలోకి తేవడానికి కొందరు స్మగ్లర్‌ల ఆలోచనలు విస్మయానికి గురిచేస్తాయి. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పడానికి వారు కొత్త కొత్త విధానాలను ఆచరిస్తుంటారు. చివరికి అధికారుల చేతికి చిక్కి తెల్లముఖాలేస్తుంటారు. తాజాగా, కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మనం సాధారణంగా బంగారన్ని ఆభరణాల రూపంలో లేదా బిస్కెట్ల రూపంలో చూస్తుంటాం. కానీ, ఈ స్మగ్లర్ దగ్గర పేస్ట్ రూపంలో కనిపించింది. బంగారాన్ని పేస్ట్‌గా చేసి జీన్స్ ప్యాంట్‌ను రెండు పొరలుగా కుట్టించుకుని దాని మధ్యలో రంగులా పూసుకున్నారు.

కన్నూర్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆ స్మగ్లర్ నుంచి 302 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారుగా రూ. 14 లక్షలు ఉండనుంది. వారు స్వాధీనం చేసుకున్న గోల్డ్ పూసిన ప్యాంట్ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోనూ ట్విట్టర్‌లో పోస్టు చేసుకుంటూ యూజర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్మగ్లర్ తెలివిని ప్రశంసిస్తూ స్మగ్లింగ్‌ను తప్పుపట్టారు. ఆ టెక్నిక్‌కు ఫిదా అవుతున్నారు. అంతటి టెక్నిక్ ఫాలో అయిన అధికారులు దొరకపట్టడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కొందరైతే తాము పెద్దయ్యాక కేరళలో కస్టమ్స్ అధికారులమవుతామని ట్వీట్ చేశారు. బంగారం ఒక లోహమని, అది పేస్ట్ రూపంలోకి మార్చినా, ప్యాంట్ పొరల్లో దాచినా మెటల్ డిటెక్టర్‌లో బయటపడాల్సిందేనని మరో యూజర్ పేర్కొన్నారు.

ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్‌లు స్మగ్లింగ్‌లో వినియోగించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే షార్జా నుంచి అమృత్‌సర్ వచ్చిన ఓ వ్యక్తి 1,894 గ్రాముల బంగారాన్ని అండర్‌వేర్‌లో దాచిపెట్టుకుని అధికారులకు చిక్కారు. ఆ బంగారన్నీ పేస్ట్ రూపంలోకి మార్చి తన లోదస్తులో దాచుకున్నారు. కానీ, చివరికి అధికారులకు దొరికిపోయారు.