ఒకే దేశం- ఒకే ఎన్నికలు.. నేడు రామ్‌నాథ్ నివాసంలో అధ్యయన కమిటీ తొలి అధికారిక భేటీ..
‘‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలి అధికారిక భేటీ ఈరోజు జరగనుందని సమాచారం.

దేశంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ‘‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 8 మంది సభ్యులను నియమించింది. అయితే ఈ కమిటీ తొలి భేటీ మొదటి అధికారిక సమావేశం ఈరోజు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుందని సమాచారం. సార్వత్రిక ఎన్నికలు ముందే జరుగుతాయనే ఊహాగానాలు మధ్య కేంద్రం చర్యలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఇక, ‘‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’’అంశాన్ని పరిశీలించే రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అధ్యయన కమిటీకి శనివారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఎనిమిది మంది సభ్యులను నియమించింది. కమిటీలో రామ్‌నాథ్ కోవింద్ చైర్‌పర్సన్‌గా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్ పర్సన్ ఎన్‌కే సింగ్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారిలు సభ్యులుగా ఉన్నారు.
అయితే, కేంద్రం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సి)లో సభ్యునిగా ఎంపికైన అధీర్ రంజన్ చౌదరి ప్యానెల్‌లో పనిచేయడానికి నిరాకరించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ కూడా రాశారు. ఒకే దేశం- ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాల పరిశీలనకు రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీలో తనను సభ్యుడిగా నియమించినట్టు మీడియా ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. అయితే ఆ కమిటీ ఏర్పాటును కంటితుడుపు చర్యగా అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. కమిటీ విధి విధానాలు దాని సిఫారసులు ఎలా ఉండాలో ముందే నిర్ణయించేలా ఉన్నాయని అన్నారు.