ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసేందుకే ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ ప్రచారం - ప్రశాంత్ భూషణ్
ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే వాటిని వాయిదా వేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, కానీ ఇది ప్రజాస్వామ్య విరుద్దం అని చెప్పారు.
గత కొంత కాలంగా దేశంలో జమిలీ ఎన్నికల చర్చ జరుగుతోంది. అయితే దానిపై ఇటీవల చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడానికే కేంద్ర ప్రభుత్వం 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (ఓఎన్ఓఈ) కోసం ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ వంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓఎన్ఓఈని అమలు చేయలేమని అన్నారు. ఎందుకంటే మన వ్యవస్థలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి, కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు మధ్యంతర దశలో పడిపోతుందని చెప్పారు. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే.. రాష్ట్రపతి పాలన విధిస్తారని అన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
‘‘అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి అధ్యక్ష పాలన వ్యవస్థకు మారుతున్నాం. కాబట్టి ఇది పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వానికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. రాష్ట్రపతి పాలన వ్యవస్థకు మారడానికి రాజ్యాంగంలో అనేక సవరణలు అవసరమని కూడా వారికి తెలుసు’’ అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదని ఆయన చెప్పారు.
‘‘ఈ వాస్తవాలన్నీ ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ ఈ ఏడాది చివర్లో జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలనే ఏకైక లక్ష్యంతో వారు ఈ ప్రచారాన్ని (వన్ నేషన్ వన్ ఎలక్షన్)ను మొదలుపెట్టారు’’ అని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పేరుతో అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికల వరకు వాయిదా వేయబోతున్నారని చెప్పారు. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారని చెప్పారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.