ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రోజు రోజుకూ రష్యా సేనలు ఒక నగరం తర్వాత మరో నగరంపై పంజా విసురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ చిక్కుకున్న భారత విద్యార్థుల ప్రాణాలు ముప్పులో ఉన్నాయి. కర్ణాటకకు చెందిన నవీన్ ఓ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు కూడా ఓ విద్యార్థి ఉక్రెయిన్‌లో అనారోగ్యంతో మరణించినట్టు సమాచారం. ఆయన మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి తండ్రి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ (Ukraine) లో దినదిన గండంగా రోజు గడుస్తున్నది. బంకర్ల నుంచి అడుగు బయట పెట్టాలంటే ప్రాణాలను పణంగా పెట్టడంగా మారింది. ఖార్కివ్‌లా ఇలాగే బంకర్ నుంచి అడుగు బయట పెట్టి.. గ్రాసరీ షాప్‌లో నిలుచున్న కర్ణాటకకు చెందిన నవీన్ ఎయిర్ స్ట్రైక్ దాడిలో ప్రాణాలు (Died) కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా, అదే ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి (Indian Student) మరణించాడు.
పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన 22 ఏళ్ల చందన్ జిందాల్ (Chandan Jindal) ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. ఆయన నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. అయితే, ఆయన చికిత్స పొందుతూ వినిషియాలోని ఓ హాస్పిటల్‌లోనే మరణించినట్టు తెలిసింది. చందన్ జిందాల్ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో వినీషియాలోని ఓ ఎమర్జెన్సీ హాస్పిటల్‌లో చేర్చారు. ఆయన ఐసీయూలో చికిత్స పొందారు. చందన్ జిందాల్ మెదడులో ఇస్కెమియా సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఆయన బుధవారం మరణించినట్టు సమాచారం.
ఫిబ్రవరి 2వ తేదీన జిందాల్ అనారోగ్యం బారిన పడగా.. జిందాల్ తండ్రి శిశన్ కుమార్, మామా క్రిష్ణ కుమార్‌లు ఈ నెల 7వ తేదీన ఉక్రెయిన్ వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు జిందాల్‌తోనే ఉన్నారు. అయితే, బుధవారం జిందాల్ మరణించినట్టు తెలిసింది. చందన్ జిందాల్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి తండ్రి శిశన్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. రొమేనియా సరిహద్దు సిరెత్‌కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు రొమేనియాలోని కొన్ని వర్గాలు తెలిపాయి. రొమేనియా నుంచి ఎయిర్ అంబులెన్స్ కోసం ఆయన రిక్వెస్ట్ చేశారు. అదే విధంగా తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహకరించాలని.. ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది.
ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న భీకర దాడిలో భారత విద్యార్థి నవీన్ శేకరప్ప గ్యానగౌడర్ (Naveen Shekharappa) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తూర్పు ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌లో నగరంలో చోటుచేసుకుంది. అయితే భారత విద్యార్థి మృతిపట్ల భారత్‌లో రష్యా రాయబారిగా ఉన్న డెనిస్ అలిపోవ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవీన్ కుటుంబానికి, భారతదేశానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వివాద ప్రాంతాల్లో భారతీయుల క్షేమం కోసం రష్యా చేయగలిగినదంతా చేస్తుందని చెప్పారు. ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థి మృతిపై రష్యా విచారణ చేపడుతుందని డెనిస్ అలిపోవ్ తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. తూర్పు ఉక్రెయిన్‌లోని ఘర్షణ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేందుకు రష్యా మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. తర్పూ ఉక్రెయిన్ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయులను రష్యన్ భూభాగానికి అత్యవసర తరలింపు కోసం భారతదేశం అభ్యర్థనలను రష్యా స్వీకరించిందని తెలిపారు. భారతీయులను తరలించే ప్రక్రియలో భాగంగా.. మానవతా కారిడార్‌లను తెరవడానికి అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని అలిపోవ్ చెప్పారు.ఇక, ఖర్కివ్‌లో నవీన్ మృతితో.. ఆ ప్రాంతంలో ఉంటున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
