శ్రీనగర్: ఉగ్రవాదులు గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకొని తల్లి దండ్రులను కలుసుకొనేందుకు వెళ్తున్న  ఓ ఎస్ఐ‌ను  టెర్రరిస్టులు  కాల్చి చంపారు. వేషధారణ మార్చుకొన్నా కూడ  టెర్రరిస్టులు  అతడిని వెంటాడి మరీ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లో జరిగింది.

జమ్మూ కాశ్మీర్ కు చెందిన  ఇంతియాజ్  అహ్మద్ మీర్  ఎస్ఐ గా కుల్గామ్ పట్టణంలో పనిచేస్తున్నాడు. ఈ ప్రాంతంలో  ఉగ్రవాదుల  కదలికలు ఎక్కువగా ఉంటాయి టెర్రరిస్టుల అణచివేతకు  ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఈ కారణంగా టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఇంతియాజ్  ఉన్నారు.

తాను పనిచేస్తున్న ఊరు దాటి వెళ్లలేని  పరిస్థితి ఆయనకు ఏర్పడింది. దీంతో సెలవుల్లో తన తల్లిదండ్రులను కలవాలని ఆయన భావించాడు.  అమ్మ నాన్నలను కలిసేందుకు  వేషాన్ని మార్చేశాడు. ప్రభుత్వ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో  తల్లిదండ్రులను కలిసేందుకు బయలుదేరాడు. 

వేషధారణ మార్చినందున  ఇక తనను  ఉగ్రవాదులు  గుర్తించలేరని ఆయన తన తోటి ఉద్యోగులకు చెప్పారు.  ఆదివారం సాయంత్రం సెలవుపై  తల్లిదండ్రులను చూసేందుకు బయలుదేరాడు.  ఉగ్రవాదులు ఇంతియాజ్ వాహనాన్ని వెంబడించారు. పూల్వామా జిల్లాలోని వాహిబుగ్ ప్రాంతంలో  ఇంతియాజ్ ను  అడ్డుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపారు.