1893లో ఇదే రోజున షికాగో స్వామి వివేకానంద చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తుచేశారు. వివేకానంద ప్రసంగం ప్రపంచం ముందు భారత సంస్కృతి గొప్పదనాన్ని అద్భుతంగా ఆవిష్కరించిందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు వివేకానంద ప్రసంగాన్ని జతచేశారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వామి వివేకానంద ప్రసిద్ధ ప్రసంగాన్ని గుర్తుచేశారు. షికాగోలో 1893లో స్వామి వివేకానంద ఇచ్చిన ప్రసిద్ధ ప్రసంగాన్ని గుర్తుచేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ఈ ప్రసంగం భారత సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిందని కొనియాడారు. ఆయన ప్రసంగానికి ఉన్న స్పిరిట్ ఉన్నత న్యాయాన్ని, సామరస్యాన్ని, సంఘటిత ప్రపంచాన్ని సృష్టించగలదని అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్‌తోపాటు బేలూర్ మఠ్ పోర్టల్ నుంచి ఆయన ప్రసంగాన్ని జత చేశారు.
1893లో ఇదే రోజున అంటే సెప్టెంబర్ 11న అమెరికాలోని షికాగోలో నిర్వహించిన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ సదస్సులో స్వామి వివేకానంద ప్రసంగించారు. ఈ ప్రసంగం భారత సంస్కృతి, హిందూయిజంపై సరికొత్త అవగాహనను కల్పించిందని భావిస్తారు. పాశ్చాత్య ప్రపంచానికి వేదాంత ఆదర్శాలను పరిచయం చేసినట్టుగానూ చెబుతుంటారు. షికాగోలో ఇచ్చిన ఈ స్పీచ్ తర్వాతే ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 19వ శతాబ్దికి చెందిన గురువు రామకృష్ణకు శిష్యువుగా ఉన్నారు. అనంతరం రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్‌లను వ్యవస్థాపించారు. 19వ శతాబ్దంలో హిందూ మతాన్ని పునరుజ్జీవనం చేయడంలో అంతర్జాతీయంగా దానికి ఒక ప్రధాన మతంగా పేరు తెచ్చినవారిలో వివేకానందను ప్రముఖుడిగా పేర్కొంటుంటారు.
సహనాన్ని, సర్వమత ఆమోదాన్ని ప్రపంచానికి నేర్పించిన హిందూ మతానికి చెందినందుకు తాను గర్విస్తున్నట్టు వివేకానంద ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. సహనాన్నే కాదు, అన్ని మతాలను నిజమైనవిగా తాము విశ్వసిస్తామని చెప్పారు.
