రిటైర్మెంట్ రోజున వ్యక్తి భావోద్వేగానికి గురవుతాడు. ఇన్నేళ్ల తన ఉద్యోగ జీవితంలో ఎత్తుపల్లాలు, సన్మానాలు, సత్కారాలు, సహోద్యోగులను తలచుకుని కన్నీటి పర్యంతమవుతాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు అద్బుతమై బహుమతి ఇచ్చాడు. ఆమెను హెలికాఫ్టర్‌లో తిప్పి సతీమణి కలను సాకారం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మాలావళి గ్రామానికి చెందిన రమేశ్‌చంద్ మీనా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 34 ఏళ్ల ఉద్యోగ జీవితానికి శనివారం రిటైర్మెంట్ ఇచ్చారు. అయితే పెళ్లయిన కొత్తలో ఓ సారి మిద్దెపై కూర్చొని ఉండగా.. ఆకాశంలో హెలికాఫ్టర్ ఎగరడాన్ని చూసిన రమేశ్ భార్య... అందులో వెళ్లడానికి ఎంత ఖర్చవుతుందని భర్తను అడిగింది.

భార్య కోరికను గ్రహించిన ఆయన ఎలాగైనా దానిని తీర్చాలని నిర్ణయించుకున్నారు. తన ఉద్యోగ విరమణ రోజునే అందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్న రమేశ్.. శనివారం జిల్లా యంత్రాంగం సహకారంతో రూ.3.70 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్‌ను బుక్ చేశారు.

జైపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి మనవడు, భార్యతో కలిసి హెలికాఫ్టర్‌లో వెళ్లారు. గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కుటుంబసభ్యులు, గ్రామస్థులు వారిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు.