ముసలివాళ్లే కదా... కత్తితో బెదిరించి, నాలుగు దెబ్బలు కొడితే డబ్బులు ఇచ్చేస్తారని భావించారు ఓ ఇద్దరు దొంగలు. పథకం ప్రకారం అర్థరాత్రి ఓ వృద్ధ దంపతులకు ఇంటికి దొంగతనానికి వచ్చారు. అయితే... వాళ్లు ఊహించినదానికి రివర్స్ జరిగింది అక్కడ.  దొంగల చేతిలో కత్తులు ఉన్నా కూడా ఆ దంపతులు ఇద్దరూ కొంచెం కూడా భయపడలేదు. పైగా వారిపై పోరాడి.. దొంగలనే తరిమి కొట్టారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... తిరునెల్వేలి, కడయంలో కత్తులతో దొంగతనానికి వచ్చిన ఇద్దరు ఆగంతకులను వృద్ధ దంపతులు వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఓ వృద్ధుడు తన ఇంట్లో కూర్చొని పని చేసుకుంటుండగా.. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చిన ఓ ఆగంతకుడు వృద్ధుడి మెడలో టవల్‌ వేసి స్తంభానికి కట్టే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే తేరుకున్న ఆ వృద్ధుడు, ఆతని భార్య దొంగలపై ఎదురుదాడి చేశారు.

ఈ క్రమంలో దొంగలకు, ఆ వృద్ధ దంపతులకు పెనుగులాట జరిగింది. ఇక ఆ వృద్ధుడైతే తన మెడకు కట్టిన టవల్‌ నుంచి విడిపించుకొని తమ వద్ద ఉన్న కుర్చీలతో ఆగంతకులపై ఎదురుదాడికి దిగారు. ఆగంతకులు కత్తులతో బెదిరించినా ఏమాత్రం జడుసుకోకుండా కుర్చీలతో దాడి చేసి దొంగలకు చుక్కలు చూపించారు. అలా ప్రతిఘటించి వారిని తరిమి తరిమి కొట్టారు. దీంతో ఆ దుండగులు పారిపోయారు.

అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో ఈ ఘటనంతా రికార్డు అయ్యింది. ఆ తర్వాత ఈ వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్టు  చేయడంతో వీడియో వైరల్ గా మారింది. వాళ్లు చూపించిన ధైర్యానికి, తెగవకు నెటిజన్లు ముచ్చటపడిపోతున్నారు. ఆ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లాగా తాత ఫైట్ చేశాడంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.