న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తరఫు వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందుకు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లాలని సూచించింది. పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు, ఎంఐఎం పిటిషన్లతో పాటు పలు పిటిషన్లు సిఏఏను సవాల్ చేస్తూ దాఖలయ్యాయి. దాదాపు 140 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణకు ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. అస్సాంలో ఎన్ఆర్సీ అమలుపై దాఖలైన పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ చేపడుతామని చెప్పింది.

సీఏఏ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా సిఏఏ ఉందని, అది రాజ్యాంగ విరుద్ధమని అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏ సమానత్వ హక్కుకు విరుద్ధంగా ఉందని, మతప్రాతిపదికపై ఆ చట్టాన్ని రూపొందించారని పిటిషనర్లు విమర్శించారు. 

సిఏఏపై 140 పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిలో 60 మాత్రమే ప్రభుత్వం దృష్టికి వచ్చాయని అటార్నీ జనరల్ చెప్పారు. ఈ పిటిషన్లను విచారణ నిమిత్తం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందని కపిల్ సిబల్ చెప్పారు.

బుధవారం ఉదయం సిఏఏ పిటిషన్లు విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డే, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ ముందుకు వచ్చాయి.