Omicron: దేశంలో 5,488కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్ర, రాజస్థాన్ లలోనే అధికం.. !
Omicron: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆరు వేల మార్కుకు చేరువవుతున్నాయి.
Coronavirus: అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్-19 థర్డ్ వేవ్ అంచనాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి సాధారణ కేసులతో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్ కోవిడ్-19 కొత్త కేసులు రెండు లక్షలకు పైగా నమోదుకావడం వైరస్ ఉధృతికి అద్దం పడుతున్నది. ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం అధికంగానే నమోదయ్యాయి.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 620 ఒమిక్రాన్ వేరియంట్ (Omicron) కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్ బారినపడ్డవారి సంఖ్య అధికం కావడంతో.. దీని బారినపడ్డ వారి సంఖ్య 5488కి పెరిగింది. కొత్తగా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో అత్యధికం రాజస్థాన్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్రలోనే వెలుగుచూశాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 86, రాజస్థాన్ లో 147, కేరళలో 136, తెలంగాణలో 137 ఒమిక్రాన్ కేసులు మోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు నమోదైన 5,488 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో 2,162 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. బుధవారం నాడు 357 మంది ఒమిక్రాన్ నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం 3,326 యాక్టివ్ చేసులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ (Omicron) కేసుల వివరాలను గమనిస్తే.. అత్యధికంగా మహారాష్ట్రలో 1367 నమోదవగా, రాజస్థాన్‌లో 792, ఢిల్లీ 549, కేరళ 486, కర్నాటక 479, పశ్చిమబెంగాల్ 294 కేసుల చొప్పున ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుండగా, దేశంలో ఇతర వేరియంట్లతో పాటు కరోనా మహమ్మారి (Coronavirus)కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిత్యం రెండున్నర లక్షలకు చేరువగా కొత్త కేసులు నమోదుకావడం దేశంలో కోవిడ్-19 ఉధృతికి అద్దం పడుతున్నది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,47,417 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత 8 నెలల కాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కొత్తగా కరోనాతో 380 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా (Coronavirus) మరణాల సంఖ్య 4,85,035కి చేరింది. దేశవ్యాప్తంగా నిన్న కరోనా నుంచి 84,825 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,47,15,361కి చేరింది. రికవరీ రేటు 95.59 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. బుధవారం దేశంలో 76,32,024 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కి చేరింది. కరోనా పరీక్షల విషయానికి వస్తే.. జనవరి 12న దేశవ్యాప్తంగా 18,86,935 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా 69,73,11,627 కరోనా (Coronavirus) శాంపిళ్లను పరీక్షించినట్టుగా తెలిపింది.