జామియత్ నేత మహమూద్ మదానీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అల్లా, ఓం రెండూ సేమ్ అని ఆయన కామెంట్ చేశారు. కొందరు అల్లా అంటే ఇంకొందరు ఖుదా అని, మరికొందరు ఖుదా అని పిలుచుకుంటారని వివరించారు.
న్యూఢిల్లీ: జామియత్ ఉలామా హింద్ ప్రెసిడెంట్ మహమూద్ మదానీ ఆదివారం తన వ్యాఖ్యలతో దుమారం రేపారు. అల్లా, ఓం రెండూ సేమ్ అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రామ్‌లీలా మైదాన్‌లో జామియత్ ఉలామా హింద్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహూమద్ మదానీ మాట్లాడారు. ‘నేను ఒక సాధువును అడిగాను. రాముడు, బ్రహ్మ, శివుడు ఉనికిలోకి రాకముందు మను ఎవరిని పూజించేవారు? అని అడిగాను. అందుకు సమాధానంగా ఆ సాధువు ఓం అని చెప్పాడు’ అని వివరించాడు.
‘అదే ఓంను తాము అల్లా అని అంటాం. కొందరు ఖుదా అంటారు. మరికొందరు గాడ్ అంటారు’ అని మదానీ అన్నారు. ఆయన వ్యాఖ్యలతో సమావేశంలో కలకలం రేగింది. ఆ కార్యక్రమంలో ఉన్న కొందరు ఇతర మత గురువులు అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వేదిక వదిలిపెట్టి వెళ్లిపోయారు.
Also Read: ఇటు నుంచి అటు మారితే.. అన్ని మర్చిపోతారా : ఈటల టార్గెట్‌గా అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యలు
అదే వేదికపై ఉన్న జైన్ ముని, ఆచార్య లోకేశ్ మునిలు అసహనం వ్యక్తం చేశారు. తాము కేవలం సంయమనంతో కలిసి ఉండటంపై మాత్రమే అంగీకరిస్తాం. ఓం, అల్లా, మనుల చుట్టూ ఆయన చెప్పిన కథలు అర్థం లేనివని అన్నారు. ఇక్కడి వాతావరణాన్ని ఆయన పూర్తిగా నాశనం చేశారని పేర్కొన్నారు. తాను అతని కంటే పెద్ద కథలు అల్లగలనని వివరించారు. ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ తొలి జైన తీర్థంకరుడు రిషభ్ అని తెలిపారు. అతనికి ఇధ్దరు కుమారులు భరత, బాహుబలి అని చెప్పారు. భరత్ పేరు మీదనే మన దేశానికి భారత్ అనే పేరు వచ్చిందని, ఈ వాస్తవాన్ని మీరు తుడిచేయలేరని పేర్కొన్నారు.
శనివారం కూడా మదానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌లకు ఈ దేశం ఎంత చెందుతుందో తనకూ అంతే చెందుతుందని అన్నారు. ఇండియా మా దేశం. ఈ దేశం మహమూద్ మదానీకి చెందినదని, నరేంద్ర మోడీ, మోహన్ భాగవత్‌లకు ఈ దేశం ఎంత చెందినదో తనకూ అంతే చెందుతుందని పేర్కొన్నారు.
