మహారాష్ట్ర సంక్షోభం వేళ ఇప్పటికీ డీలా పడ్డ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగిలింది. అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి అధికారులు సీల్ వేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 

గత కొన్నిరోజులుగా మహారాష్ట్రలో జరిగిన రాజకీయ సంక్షోభానికి (maharashtra crisis) ఈ వారం తెరపడిన సంగతి తెలిసిందే. ఏక్ నాథ్ షిండే (eknath shinde) నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రేకు (uddhav thackeray) వ్యతిరేకంగా గౌహతిలోని హోటల్ లో క్యాంప్ పెట్టారు. తమదే అసలైన శివసేన అని.. బాలాసాహెబ్ ఆశయాలకు , సిద్ధాంతాలకు ఉద్ధవ్ తూట్లు పొడిచారంటూ వారు ఆరోపించారు. అనూహ్య పరిణామాల మధ్య సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో రెబల్స్ మద్ధతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ మద్ధతుతో ఏక్ నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తొలుత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన తనకు బదులుగా షిండేనే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. ఆ తర్వాతి పరిణామాలతో డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ (devendra fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. 

కాగా అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కోరుతూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూలై 11న విచారించనుంది. అయితే అదే రోజు ఎమ్మెల్యేల అనర్హత వేటును సవాల్ చేస్తూ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను కూడా అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది.

ALso REad:బాల్ ఠాక్రే సిద్ధాంతాలను శివసేన-బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది - సీఎం ఏక్ నాథ్ షిండే

మరోవైపు.. మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్త స్పీక‌ర్ గా రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) ఎంపికయ్యారు. బీజేపీ నుంచి బ‌రిలో దిగిన ఆయ‌న‌కు 164 ఓట్లు రాగా, శివ‌సేన నుంచి ఎంవీఏ త‌రుఫున పోటీలో ఉన్న రాజన్ సాల్వీకి 107 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నిక బీజేపీ సహ‌కారంతో కొత్త‌గా ఎన్నికైన సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో జ‌రిగింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా చేప‌ట్టారు. ఇద్దరు అభ్యర్థుల ఓట్ల లెక్కింపు హెడ్ కౌంటింగ్‌తో ప్రారంభమైంది. మొదట రాహుల్ నార్వేకర్ మద్దతుదారులు వారి పేర్లను నంబర్‌లతో చెప్పడం ప్రారంభించ‌గా.. ఆయ‌న‌కే అత్యధిక ఓట్లు వచ్చాయి.

అయితే ఇప్పుడు అసలైన శివసేన వర్గం తమదేనంటూ ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని వర్గం, సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెండో వర్గం వాదిస్తుండటంతో రాష్ట్ర పరిణామాలు హాట్ హాట్‌గా మారాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి ఆదివారం సీల్ వేయడం సంచలనం సృష్టించింది. ఈ మేరకు కార్యాలయాన్ని మూసివేసినట్లుగా అధికారులు నోటీసు అంటించారు.