ఓ మహిళ అయి ఉండి మరో మహిళ అది కూడా గర్భిణి మీద కనికరం చూపించలేదో మహిళా ఎస్సై. నడిరోడ్డు మీద ఎనిమిది నెలల నిండు గర్భిణీ ని నడిపించిన ఆరోపణల కింద స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ రీణా బక్సల్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

కప్తిపడా స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ప్రధాన్ కు ఈ స్టేషన్ బాధ్యతలు అదనంగా కేటాయిస్తూ మయూర్‌భంజ్‌ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్ వ్యవధిలో మయూర్‌భంజ్‌ స్టేషన్ అధికారులు పర్యవేక్షణలో రీణా బక్సల్‌ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉత్తర్వులను తక్షణ అమలు కోసం ఆమె బాధ్యతలను స్టేషన్లో సహాయ సబ్‌ ఇన్‌స్పెక్టరు బి. డి. దాస్‌ మహాపాత్రోకు అప్పగించాలని పేర్కొన్నారు. మయూర్‌భంజ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

శరత్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. గర్భిణీ గురుబారి బిరూలి, భర్త బిక్రమ్‌ బిరూలితో కలిసి ఆరోగ్య పరీక్షల కోసం వైద్యుని దగ్గరకు బైక్ మీద బయలుదేరింది. నోటా పంచాయతీ నుంచి ఉదొలా వెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీ చేశారు.

భర్త హెల్మెట్ ధరించినా, భార్య పెట్టుకోనందున జరిమానా చెల్లించాలని అడ్డుకున్నారు. నగదు లేనందున ఆన్లైన్లో జరిమానా చెల్లించేందుకు బాధితులు అభ్యర్థించినప్పటికీ పోలీసులు వినలేదు. 

దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గర్భిణీ గురుబారి బిరూలిని నడిరోడ్డు మీద వదిలేసి, భర్త విక్రమ్ ను పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. 

ఘటనా స్థలం నుంచి 3 కిలోమీటర్ల దూరం దాదాపు నాలుగు గంటల సేపు కష్టపడి నడుచుకుంటూ గర్భిణి పోలీస్ స్టేషన్ కు చేరి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ అమానుష సంఘటన పట్ల జిల్లా పోలీసు అధికార యంత్రాంగం స్పందించి సంబంధిత స్టేషన్‌ అధికారిపై సస్పెన్షన్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.