ఆమెకు పెళ్లయ్యింది. భర్త, అత్తమామ, మంచి కుటుంబం అంతా ఉన్నారు. జీవితం సాఫీగా సాగిపోతోందనగా ఆ దంపతుల మధ్యలోకి మరో వ్యక్తి అడుగుపెట్టాడు. పెళ్లికి ముందు ఆమెకు ప్రియుడు ఉండగా.. పెళ్లి తర్వాత కూడా అతనిని వదలుకోలేకపోయింది. అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో... ఆమె ప్రియుడితో లేచిపోవాలని ప్లాన్ వేసింది. తీరా అత్తింటికి దొరికి అడ్డంగా బుక్కైంది. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఒడిశాలోని సుందర్‌గడ్‌ జిల్లా రౌర్కెలా బ్రాహ్మణి తరంగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధి మండియాకుదర్‌ గ్రామంలో ఈ సంఘటన సోమవారం జరిగింది. జిల్లాలోని లఠికొటా పంచాయతీ ముండాఝొరొ గ్రామస్తురాలితో మండియాకుదర్‌ గ్రామస్తుడికి ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. పెళ్లికి ముందు బిర్సా స్టేషన్‌ పరిధిలోని చిరుబెడా గ్రామస్తుడు పురాణ్‌ సింగ్‌తో ఆమెకి  ప్రేమ వ్యవహారం సాగింది.

అయితే తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై భర్తకు అనుమానం కలిగింది.దీంతో.. భార్యను వేధించడం మొదలుపెట్టాడు.  మెట్టినింటిలో వేధింపులు తాళలేని పరిస్థితి తారసపడడంతో ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఆ ఇల్లాలు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రియుడు పురాణ్‌ సింగ్‌తో ఇల్లాలు లేచిపోతుండగా ఓరాం గ్రామస్తులకు పట్టుబడింది. 

బస్టాండ్‌లో వారిద్దరినీ గ్రామస్తులు పట్టుకున్నారు. ఆమెను తీసుకుపోతున్న ప్రియుడు పురాణ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రేమికుల్ని బంధించారు. వారి కాళ్లూచేతులు కట్టి పడేశారు. ప్రియుడు పురాణ్‌ సింగ్‌ కుటుంబీకులకు కబురు చేశారు. ఘటనా స్థలానికి కుటుంబీకులు చేరడంతో గ్రామస్తులంతా కలిసి చర్చించి ఓ  తీర్మానం ఖరారు చేశారు. 

పెళ్లి ఖర్చుల్ని పరిహారంగా చెల్లించి వివాహితను పురాణ్‌ సింగ్‌తో తీసుకుపొమ్మని తీర్మానించారు. పెళ్లి ఖర్చుల కింద రూ.1 లక్ష 50 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌పట్ల ప్రియుడి కుటుంబీకులు అంగీకరించారు. తక్షణమే రూ.50 వేలు చెల్లించి మిగిలిన సొమ్ము త్వరలో చెల్లిస్తామని అభ్యర్థించడంతో ప్రేమికుల్ని గ్రామస్తులు విడుదల చేశారు.