ఒడిశాకు చెందిన ఓ మహిళ రూ. 1.5 లక్షలను సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత భర్త ఆమెకు తలాఖ్ అని మూడు సార్లు ఉచ్చరించి అక్రమంగా విడాకులు ఇచ్చాడు. 

భువనేశ్వర్: ఒడిశాలో ఓ వివాహిత సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయింది. సుమారు రూ. 1.5 లక్షలు పోగొట్టుకుంది. దీంతో అసంతృప్తి చెందిన భర్త ఆమెకు త్రిపుల్ తలాఖ్ చెప్పి విడాకులు ఇచ్చాడు. మన దేశంలో త్రిపుల్ తలాఖ్ వాడటం 2017 నుంచి చట్ట వ్యతిరేకమైన చర్య.

ఈ కేసులో 45 ఏళ్ల వ్యక్తిపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్రపాడ జిల్లాకు చెందిన 32 ఏళ్ల వివాహిత తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను రూ. 1.5 లక్షలను సైబర్ మోసంలో కోల్పోయానని తెలిసిన తర్వాత గుజరాత్‌లో ఉంటున్న తన భర్త ఫోన్‌లో తలాక్‌ను మూడు సార్లు ఉచ్చరించాడని ఆమె తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీన తనకు ఈ రూపంలో అక్రమంగా విడాకులు ఇచ్చాడని ఆరోపించింది.

ఆ మహిళకు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. ముగ్గురు టీనేజీ పిల్లలకు తల్లి.

ముస్లిం విమెన్ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదైనట్టు కేంద్రపాడ సదర్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సరోజ్ కుమార్ సాహూ తెలిపారు. ఈ చట్టం కింద త్రిపుల్ తలాఖ్ నిషేధం. అలా విడాకులు ఇచ్చిన వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

Also Read: మహిళ సహా 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. హల్ద్వానీ జైలులో పరిస్థితి ఇదీ

అయితే, ఆమె సైబర్ క్రిమినల్స్ చేతిలో ఎలా మోసపోయిందో మాత్రం వెల్లడించలేదు.

త్రిపుల్ తలాఖ్‌ను 2017లో సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆ సాంప్రదాయాన్ని తప్పుపట్టింది. నిషేధం విధించింది.