దేశం టెక్నాలజీ వెంట పరుగులు తీస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇతర దేశాల్లో పోటీ పడుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపు ఇప్పటికీ చేతబడి,క్షుద్రపూజలు అంటూ తిరిగేవారు, మూఢ నమ్మకాలను బలంగా నమ్మేవారు చాలా మంది ఉన్నారు. వాటిని నమ్మి.. అమాయలకు దారుణ శిక్షలు వేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.  అందుకు తాజా సంఘటనే ఉదాహరణ.

ఓ మహిళకు పుట్టుకతోనే కాలికి 20 వేళ్లు, చేతికి 12వేళ్లు ఉన్నాయి. వాటిని  కారణంగా చూపించి ఆమె మంత్రగత్తె అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆమె కనీసం వృద్ధురాలు అనే జాలి కూడా లేకుండా దారుణమైన మాటలతో తూట్లు పొడిచారు. ఆమె ఇంట్లో నుంచి బటయకు అడుగుపెట్టడానికి వీలు లేదంటూ హుకుం జారీ చేశారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

ఒడిశా రాష్ట్రం కదపడ గ్రామానికి చెందిన నయన్ కుమారి(63) పుట్టుకతోనే ఆమెకు కాళ్లకు 20వేళ్లు, చేతికి 12వేళ్లు ఉన్నాయి. జన్యులోపంతో అవి అలా వచ్చాయి ఆమెకు. కాగా... పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చికిత్స చేయించుకునే స్థోమత లేక అలానే ఉంచుకుంది. అవి ఆమెతోపాటు పెరిగి పెద్దగయ్యాయి. 

 

ఇప్పుడు ఆమె చేతులు,కాళ్లు ఎక్కువ వేళ్లతో భయంకరంగా ఉన్నాయి. వాటిని చూసిన స్థానికులు మూఢ నమ్మకాలతోఆమెకు మంత్రాలు వస్తాయనే నెపంతో ఇళ్లు దాటనివ్వడంలేదు. దీంతో ఆమె ముసలితనంలో కారాగార శిక్షలా ఒంటరిగా మిగిలిపోయింది. తనకు ఆ చెర నుంచి విముక్తి కల్పించాలని ధీనంగా వేడుకుంటోంది. కాగా ఇది జన్యుపరలోపం వల్ల వచ్చే అసాధారణ ఘటనగా వైద్యులు చెబుతున్నారు. ప్రతి 5వేల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.