ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదంలో 278 మంది మరణించారు. ట్రాక్ పై నుంచి శవాలను తొలగించిన రెస్క్యూ సిబ్బంది.. ప్రాణాలతో ఉండి అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కూడా శవంగానే భావించి తొలగించారు. మిగిలిన శవాలతోపాటు ఆయననూ ఓ స్కూల్ గదిలో వేశారు. మళ్లీ వాటిని అక్కడి నుంచి తొలగించడానికి రెస్క్యూ సిబ్బంది వెళ్లగా ఆ వ్యక్తి జీవించే ఉన్నాడని తెలిసింది.
భువనేశ్వర్: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనకు సంబంధించి ఎన్నో విభ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది శవాలను తొలుత ధ్వంసమైన బోగీల నుంచి, ట్రాక్‌ల పై నుంచి తొలగించారు. సమీపంలోని ప్రభుత్వానికి చెందిన నిర్మాణాల్లో ఉంచారు. ఓ స్కూల్ రూమ్‌లో అలా శవాలను వేశారు. అందులో ఒక వ్యక్తి సజీవంగానే ఉన్నాడు. కానీ, స్పృహ కోల్పోయి ఉన్నాడు. అక్కడున్న శవాలను తొలగించడానికి రెస్క్యూ వర్కర్లు మళ్లీ ఆ గదిలోకి వచ్చారు. అప్పుడు శవాల నడుమ నడుస్తుండగా అందులో నుంచి ఓ చేయి తన కాలికి తగిలినట్టు భావించాడు. వెంటనే ఆ చేయి తన కాలిని పట్టుకుంది. ఆ రెస్క్యూవర్ హతాశయుడయ్యాడు.
పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరగణాల జిల్లాలోని చర్నెఖాలి గ్రామానికి చెందిన రాబిన్ నయ్యా అదే గ్రామానికి చెందిన మరో ఏడుగురు గ్రామస్తులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో బయల్దేరారు. ఏపీలో పని చేసుకోవడానికి వలస కార్మికులుగా వారు వస్తుండగా బాలాసోర్‌లో ప్రమాదం జరిగింది.
రాబిన్ నయ్యా ఆ కుదుపులో స్పృహ కోల్పోయాడు. బోగీలో నుంచి బయటకు ఎగిరివచ్చి ట్రాక్ పై పడిపోయాడు. ఇతర శవాలను ట్రాక్ పై నుంచి తొలగించినట్టుగానే రాబిన్ నయ్యాను కూడా రెస్క్యూ స్టాఫ్ అక్కడి నుంచి ఆ శవాలతోనే తీసుకెళ్లి సమీపంలోని ఓ స్కూల్ గదిలో వేశారు. డజన్ల కొద్ది శవాల నడుమ రాబిన్ నయ్యా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు.
Also Read: Odisha: బాలాసోర్ రైలు పట్టాలపై ప్రేమ కవితలు.. డైరీలోనే ఆ ప్రేమ శిథిలం
ఆ గదిలో నుంచీ శవాలను తొలగించడానికి మళ్లీ రెస్క్యూ సిబ్బంది వెళ్లినప్పుడు రాబిన్ నయ్యాకు కొంచెం కొంచె మెలకువ వస్తున్నది. తనకు దగ్గరగా వస్తున్న అడుగుల శబ్దాన్ని గ్రహించాడు. చేతిని అక్కడికి పోనిచ్చి ఆ వ్యక్తి కాలు పట్టుకున్నాడు. ‘నేను చనిపోలేదు, బతికే ఉన్నా, దయచేసి నాకు కొన్ని నీళ్లు ఇవ్వండి’ అంటూ అన్నాడు.
తన కాలును చేయి పట్టుకోవడంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి.. ఈ మాటలు వినడంతో కొంత తమాయించుకున్నాడు. అపనమ్మకం నుంచి బయటకు వచ్చి ఆ మనిషి వైపు చూశాడు. అతడు జీవించే ఉన్నాడని నిర్దారించుకుని వెంటనే హాస్పిటల్‌కు పంపించాడు.
నీళ్లు అడిగిన రాబిన్ తనను కాపాడాలని ఆ రెస్క్యూవర్‌ను కోరినట్టు ఆయన అంకుల్ మానవేంద్ర సర్దార్ తెలిపారు. రెండు కాళ్లు కోల్పోయిన రాబిన్ నయ్యా మేదినీపూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.
రాబిన్ నయ్యాతో వెళ్లిన ఆరుగురు మిత్రుల ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
