ఒడిశా రైలు ప్రమాదం : క్లెయిమ్ చేయని మృతదేహాలకు అంత్యక్రియలు.. గడ్డకట్టడంతో ఆలస్యమైన దహన సంస్కారాలు..
ఒడిశాలో ఘోర రైలు మరణించి, ఎవరూ క్లెయిమ్ చేయని 28 మృతదేహాల్లో తొమ్మిదింటికి మంగళవారం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భరత్ పూర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు జరిగాయి.
ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 297 ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను వెలికి తీసిన తరువాత దాదాపుగా వారి కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా కొన్ని మృతదేహాలను ఎవరూ క్లైయిమ్ చేసుకోలేదు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు 28 మృతదేహాలు భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో భద్రపర్చారు. అందులోని 9 డెడ్ బాడీలకు మంగళవారం అధికారుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దహన సంస్కారాలను గౌరవంగా నిర్వహించడానికి భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. వాటిని ఆచారాల ప్రకారం భరత్ పూర్ శ్మశానవాటికలో దహనం చేశారు.
బీఎంసీ సీనియర్ అధికారి పర్యవేక్షణలో ఎయిమ్స్ నుంచి మృతదేహాలు తీసుకువచ్చి సాయంత్రం 5 గంటలకు దహన సంస్కారాలు ప్రారంభించారు. పర్దీప్ సేవా ట్రస్ట్ కు చెందిన 12 మంది సభ్యుల బృందం నిబంధనల ప్రకారం మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించింది. ట్రస్టులోని ఓ సభ్యుడు మృతదేహాలను చితిపై ఉంచి దహనం చేశారు. అయితే మృతదేహాలు గడ్డకట్టిన స్థితిలో ఉండటంతో సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టడంతో ప్రక్రియ ఆలస్యమైంది.
ఒక్కో మృతదేహానికి దహన సంస్కారాలకు కనీసం నాలుగు గంటల సమయం పట్టింది. మైనస్ టెంపరేచర్ లో మృతదేహాలను భద్రపరచడంతో మృతదేహాలు ఐస్ స్లాబ్ లుగా మారాయి. మృతదేహాలను గౌరవప్రదంగా దహనం చేసేందుకు అవసరమైన నాణ్యమైన కలప, నెయ్యిని ఏర్పాటు చేశారు. దహన సంస్కారాల అనంతరం మిగిలిన అస్థికలను నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేయడానికి సేకరించారు.
ఈ ఏడాది జూన్ 2న రాత్రి 7 గంటల సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన కొన్ని బోగీలు అదే సమయంలో వెళ్తున్న బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ లోని చివరి కొన్ని బోగీలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా 297 మంది చనిపోయారు. అయితే ఇందులో ఎయిమ్స్ భువనేశ్వర్ 162 మృతదేహాలను స్వీకరించింది. వాటిలో 81 మృతదేహాలను మొదటి దశలో మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మరో 53 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 28 మృతదేహాలను ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. ఇక అప్పటి నుంచి పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ నుంచి సేకరించిన ఐదు డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో వాటిని భద్రపరిచారు.