ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 50 మంది మృతి.. 179కి చేరిన క్షతగాత్రుల సంఖ్య..
Odisha | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందగా, 179 మంది గాయపడ్డారు

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుండి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొనడంతో పట్టాలు తప్పింది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందగా, 179 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకు కూడా పెరిగే అవకాశముంది.
ప్రమాదానికి సంబంధించిన వివరాలను రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ తెలియజేస్తూ.. "శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో, 2841 షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని 10-12 కోచ్‌లు బాలాసోర్ సమీపంలో పట్టాలు తప్పడంతో పాటు ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. కొంత సమయం తరువాత యశ్వంత్‌పూర్ నుండి హౌరాకు వెళ్లే రైలు నంబర్ 2864 పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొట్టింది. దీని కారణంగా దాని 3-4 కోచ్‌లు పట్టాలు తప్పాయని తెలిపారు. ప్రస్తుతం రైల్వే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. ఎవరైనా ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయారా అనేది ధృవీకరించబడలేదు. అయితే చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సౌత్-ఈస్ట్రన్ జనరల్ మేనేజర్ స్పాట్‌కి బయలుదేరారు. దీంతో పాటు సమీపంలోని డీఆర్‌ఎం తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి బయలుదేరారు.
అమిత్ షా సంతాపం
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సంతాపం తెలిపారు. NDRF బృందం ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకుంది. ఇతర బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. “ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో కలత చెందాను. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందజేస్తున్నామని ప్రధాని ట్వీట్ చేశారు.
హెల్ప్‌లైన్ నెంబర్లు
సహాయక చర్యల కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.
షాలిమార్ : 9903370746
ఖరగ్‌పూర్ : 8972073925, 9332392339
బాలేశ్వర్ : 8249591559, త7978418322
హౌరా : 033-26382217