ఒడిశాలోని బాలసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని రైల్వే అధికారులు తెలిపారు. 

ఒడిశాలోని బాలసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. అలాగే ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 200 మంది చికిత్స పొందుతున్నారని తూర్పు మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు.

‘‘రైలు ప్రమాదంలో 1,100 మంది గాయపడ్డారు. వారిలో 900 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో సుమారు 200 మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరణించిన 278 మందిలో 101 మృతదేహాలు ఇంకా గుర్తించాల్సి ఉంది’’ అని రింకేష్ రాయ్ తెలిపారు. 

ఇదిలా ఉంటే.. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత్ కులంగే మాట్లాడుతూ.. ‘‘భువనేశ్వర్‌లో ఉంచిన మొత్తం 193 మృతదేహాలలో 80 మృతదేహాలను గుర్తించడం జరిగింది. 55 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ 1929కు 200 కంటే ఎక్కువ కాల్స్ వచ్చాయి. మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించడం జరుగుతుంది’’ అని చెప్పారు. 

ఇక, బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు విచ్చలవిడిగా పడిపోయాయి. కొన్ని కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పైకి పడ్డాయి. తర్వాత కొంతసేపటికే యశ్వంత్‌పూర్ నుంచి హౌరాకు వెళుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొట్టడంతో.. ఆ రైలులోని కొన్ని బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఇక, శనివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలాసోర్‌లో ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు.