ఒడిశాలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ హవా కనిపించింది. ఇప్పటి వరకు  ప్రకటించిన ఫలితాల్లో దాదాపు 87.20 శాతం స్థానాలు బీజేడీ గెలుచుకుంది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడిపోయాయి. 

ఒడిశా పంచాయతీ ఎన్నికలలో అధికార బీజేడీ (Biju Janata Dal) తన విజయ పరంపరను కొనసాగించింది, జిల్లా పరిషత్ జోన్లలో 87.20 శాతం 829 స్థానాలకు గాను 743 స్థానాలను గెలుచుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మంగళవారం వివ‌రాలు వెల్ల‌డించింది. 

రాష్ట్రంలోని మొత్తం 852 జిల్లా పరిషత్‌ స్థానాల్లో 829 స్థానాల్లో ఓట్ల లెక్కింపును కమిషన్‌ పూర్తి చేయగా.. మిగిలిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వాటి ఫలితాలు ఈ రోజు ప్ర‌క‌టిస్తామ‌ని SEC అధికారి తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేడీ 743 సీట్లు గెలుచుకోగా ప్రత్యర్థి బీజేపీ (barathiya janatha party) 42 సీట్లు, కాంగ్రెస్ (congress) 37 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాయి. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. 

ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలతో 2017లో జ‌రిగిన పంచాయతీ ఎన్నికలను పోలిస్తే ఈ సారి BJD 267 సీట్లు అధికంగా గెలుచుకుంది. 2022లో BJP 255 జ‌డ్పీ స్థానాలను కోల్పోయింది. 2017 ఎన్నికల్లో కాషాయ‌పార్టీ 297 స్థానాలను కైవసం చేసుకోగా.. ప్ర‌స్తుతం ఆ సంఖ్య 42కి తగ్గింది. 2017లో 60 జెడ్పీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 37 సీట్లు మాత్రమే గెలుచుకుంది. గత ఎన్నికల్లో 17 మంది ఇండిపెండెంట్లు, ఇతరులు గెలిచిన సీట్లు ఈ ఎన్నికల్లో ఏడుకు తగ్గాయి.

బీజేడీ అఖండ విజయంతో రాష్ట్రంలోని 30 జిల్లాల్లోనూ అధికారం చేప‌ట్టేందుకు సిద్ధమైంది. 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎనిమిది జిల్లాల్లో పరిషత్ ల‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ 10 జిల్లాల్లోని జెడ్పీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోగా.. కాంగ్రెస్ 18 జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయింది. భద్రక్ (Bhadrak), దేవ్‌ఘర్ (Deogarh), జగత్‌సింగ్‌పూర్ (jagatsinghpur), జాజ్‌పూర్ (Jajpur), జార్సుగూడ (Jharsuguuda), కోరాపుట్ (Koraput), మల్కన్‌గిరి (Malkangiri), మయూర్‌భంజ్ (Mayurbhanj), నబ్బరంగ్‌పూర్ (Nabbarangpur), రాయగడ (Rayagada) జెడ్పీ స్థానాల్లో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేకపోయింది.

అదేవిధంగా అంగుల్ (Angul), బర్గఢ్ (Bargarh), భద్రక్ (Bhadrak), బౌధ్ (Boudh), కటక్ (Cuttack), దేవ్‌గఢ్ (Deogarh), దెంకనల్ (Dhenkanal), గంజాం (Ganjam), జాజ్‌పూర్ (Jajpur), ఝర్సుగూడ (Jharsuguda), కేంద్రపారా (Kendrapara), కియోంజర్ (Keonjhar), ఖుర్దా (Khurda), మయూర్‌భంజ్ (Mayurbhanj), నయాగర్ (Nayagarh), పూరీ (Puri), సంబల్‌పూర్ (Sambalpur), సుందర్‌ఘర్ (Sundargarh)జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఖాతాలను తెరవలేకపోయారు. కాగా.. మూడంచెల పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 16, 18, 20, 22, 24 తేదీల్లో ఐదు దశల్లో జరిగాయి. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో కౌంటింగ్ జ‌ర‌గ్గా.. కొన్ని చోట్ల రీ కౌంటింగ్ జ‌రుగుతోంది.