ఒడిశాలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ట్రైబల్ ప్రజలు ఎక్కగా ఉండే ఓ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్న తొమ్మిది మంది అభ్యర్థులకు పరీక్ష పెట్టారు. తద్వార అభ్యర్థికి ఉన్న లోతైన అవగాహనను తెలుసుకోవాలని, లేదా అభ్యర్థిపై తమ నమ్మకాలను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
భువనేశ్వర్: సాధారణంగా గ్రామ పంచాయతీ(Gram Panchayat) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏం చేస్తారు? గ్రామంలోని వివిధ సముదాయాల దరిచేరి తాను సర్పంచ్(Sarpanch) అయితే.. చేసే పనులను వివరిస్తారు. కొన్ని హామీలు ఇస్తారు. ఇతర ఎన్నికల్లాగే ప్రజలను ప్రలోభ పెట్టేవారూ కోకొల్లలు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ప్రజలు తమకు ఇష్టం వచ్చినవారికి లేదా విశ్వసించినవారికి ఓటు వేస్తారు. అలా పడ్డ ఓట్లను గణిస్తే.. ఎక్కువగా వచ్చిన అభ్యర్థి సర్పంచ్‌గా ఎన్నిక అవుతారు. కానీ, ఒడిశా(Odisha)లోని ఓ గ్రామ ప్రజలకు ఇందుకు అదనపు హంగును చేర్చారు.
అభ్యర్థులు ప్రజలను ప్రలోభపెట్టడం కాదు.. ఎన్నికలకు ముందే అభ్యర్థులు ఏపాటివారో తెలుసుకోవడానికి ప్రజలే స్వయంగా పరీక్ష పెట్టడం సంచలనంగా మారింది. అదీ ట్రైబల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఓ గ్రామ ప్రజలు ఈ పరీక్ష నిర్వహించడం గమనార్హం. ఈ పరీక్షలు ఇప్పుడు ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.
ఒడిశాలో పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 26 నుంచి 28వ తేదీల వరకు కౌంటింగ్ జరగనుంది. సుందర్‌గడ్ జిల్లా కుత్ర గ్రామపంచాయతీ పరిధిలోని మాలుపద ఊరిలో సర్పంచ్ సీటు గెలవడానికి తొమ్మిది మంది బరిలోకి దిగారు. అయితే, అక్కడి ప్రజలు ఈ ఎన్నికలను అనూహ్యంగా ఆలోచించారు. ఓ స్కూల్ ఆవరణకు సర్పంచ్‌గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్న తొమ్మిది మందిని ప్రజలు ఆహ్వానించారు. గురువారం ఉదయం వారిని స్కూల్ క్యాంపస్‌కు ఆహ్వానించి.. సర్పంచ్ క్యాండిడేట్ సామర్థ్యాన్ని లేదా.. తమలో అభ్యర్థిపై విశ్వాసాన్ని పెంచడానికి ప్రత్యేకంగా టెస్టు చేస్తామని ప్రజలు తెలిపారు. ఆ ‘ఎంట్రెన్స్ ఎగ్జామ్స్’కు ఎనిమిది మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ ఎనిమిది మంది అభ్యర్థులకు ప్రజలు పరీక్షలు పెట్టారు. అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణాలు ఏమిటి? సర్పంచ్ ఆశావాహులుగా వారి ఐదు లక్ష్యాలు ఏమిటి? సంక్షేమ కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యం, గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరు, వాడలకు సంబంధించిన వివరాలను గురించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుపాలని అభ్యర్థులను ఆ టెస్టులో ప్రశ్నించారు.
తొలి విడత ఎన్నికలు ముగిసిన తర్వాతి రోజే ఈ పరీక్ష ఫలితాలను వెలువరించనున్నారు.
కాగా, బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి కమ్ బ్లాక్ ఎలక్షన్ అధికారి రబీంద సేథిని ఈ విషమయై అడగ్గా.. ఇలా పరీక్షలు పెట్టడానికి అధికారికంగా ఎలాంటి చట్టాలు లేవని వివరించారు. తాను కూడా ఈ పరీక్షల గురించి విన్నారని, కానీ, ఎవరూ ఈ ప్రక్రియపై కంప్లైంట్ చేయలేదని వివరించారు. ఆ వ్యవహారం తమ దాకా వస్తే.. దర్యాప్తులను ఆదేశిస్తామని పేర్కొన్నారు.
