బీడు బారిన నేలల్లోకి గంగమ్మను తరలించి.. ఒంటి చేత్తో వంద ఎకరాలకు నీరిచ్చిన... కరువును పారద్రోలి పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యక్తికి ఇప్పుడు ఉపాధి దూరమైంది. ఒడిశాలోని వైతరిణీ గ్రామానికి చెందిన దైతారీ నాయక్‌కు ఊరంతా కరువుతో అల్లాడిపోవడం.. పక్కనే కాలువ వున్నా గ్రామం ఎడారిగా మారడాన్ని తట్టుకోలేకపోయాడు.

ప్రభుత్వాన్ని, అధికారులను ఆశ్రయిస్తే ప్రయోజనం శూన్యమని భావించి కుటుంబసభ్యుల సాయంతో కొండలు, గుట్టల మధ్య నుంచి మూడు కిలోమీటర్ల కాలువ తవ్వి పంట పొలాలను తడిపాడు. గ్రామం నుంచి కరువును తరిమికొట్టేందుకు దైతారీ నాయక్ చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకోవాలన్నది ఎంతో మంది కల.. అందుకోసం ఎంతగానో శ్రమిస్తారు. అవార్డ్ వస్తే ఎగిరి గంతేస్తారు. అయితే తనకు పద్మశ్రీ అవార్డ్ రావడం వల్ల ఉపాధి పోయిందని దైతారీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో తాను రోజువారీ కూలీగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునేవాడినని.. అయితే పద్మశ్రీ వచ్చినప్పటి నుంచి తనను ఎవరు పనికి పిలవట్లేదని వాపోయాడు. ప్రభుత్వం నిన్ను గొప్ప వ్యక్తిని చేసింది.. ఇప్పుడు మేం నిన్ను పనికి పిలిస్తే నీ గౌరవాన్ని తగ్గించినట్లవుతుందని గ్రామస్తులు చెబుతున్నారని నాయక్ వాపోయాడు.

ఉపాధి లేక ఇల్లు గడవటం కష్టమైపోయిందని.. పద్మశ్రీ వచ్చాక గ్రామంలో నాకున్న విలువ తగ్గిపోయిందని.. తాను ఈ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నానని.. అప్పుడైనా తనకు పని దొరుకుతుందని దైతారీ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం ఆయన ఓ చిన్న పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైనా, డబ్బుల్లేక దానిని మధ్యలోనే ఆపేశారు. ఆయన కుమారుడు అలేఖ్ కూడా దినసరి కూలీగానే పనిచేస్తున్నారు.

కాగా దైతారీ నాయక్ పరిస్థితి జిల్లా కలెక్టర్ వరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. ఆయన సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.