కొందరు మనుషులు సమాజంలో సైకోల్లా తిరుగుతుంటారు. ఏదో ఒక చిన్న కారణానికి కూడా కక్ష కట్టి కిరాతకంగా ప్రవర్తిస్తారు. ఒడిశాలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఓ కుక్క తన మేకను కరిచిందనే కోపంతో వూళ్లో వున్న అన్ని కుక్కలకు విషం ఇచ్చి హతమార్చాడు.

వివరాల్లోకి వెళితే.. కటక్ జిల్లాలోని మహంగకు చెందిన బ్రహ్మానం మాలిక్ అనే వ్యక్తి ఓ మేకను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో దానిని  ఓ రోజు వీధి కుక్క కరిచింది. దానికి గాయమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన మాలిక్.. కుక్కలపై కక్షకట్టాడు.

ఏకంగా వూళ్లోని కుక్కలన్నింటి ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నాడు. దీనికి భరత్ మాలిక్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా అతనితో కలిసి కుక్కలకు ఎంతో ఇష్టమైన మాంసం తీసుకొచ్చి అందులో విషం కలిపాడు.

అనంతరం ఆ మాంసాన్ని కుక్కలకు వేశాడు. దీనిని తిన్న సుమారు 40 కుక్కలు రోడ్డుపై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. ఈ విషాదంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ కళ్లముందే కుక్కలు చనిపోవడం చూడలేక.. వెంటనే ఆ ఊరి సర్పంచ్‌కు విషయం చెప్పారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.