చేతబడి చేసిందని... అలా చేయడం వల్లే తన కుమార్తె చనిపోయిందని ఓ వ్యక్తి మరో మహిళపై పగపెంచుకున్నాడు. ఈ కారణంతోనే సదరు మహిళను అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. నరికిన తలను చేతితో పట్టుకొని దాదాపు 13 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నువాసహి అనే గిరిజన గ్రామంలో నివసించే బుద్ధురామ్ సింగ్(30) అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. కూతురంటే ఎంతో ప్రాణంగా బతికేవాడు. అలాంటి కుమార్తె మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. కాగా.. తన కుమార్తె చావుకు అదే ప్రాంతంలో ఉండే చంపాసింగ్(60) అనే మహిళ కారణమని భావించాడు.

ఆమె చేతబడి చేయడం వల్లే తన కుమార్తె చనిపోయిందని సదరు మహిళపై పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా హత్య చేయాలని అనుకున్నాడు. సోమవారం ఉదయం ఆమె నిద్రపోతుండగా.. జుట్టుపట్టుకొని బయటకు లాక్కొచ్చాడు. అనంతరం అందరూ చూస్తుండగానే ఆమె తల నరికి హత్య చేశాడు.

ఆ నరికిన తలను, ఆమెను చంపడానికి ఉపయోగించిన గొడ్డలిని చేత పట్టుకోని 13 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి.. పోలీసులకు లొంగిపోయాడు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.