తలదాచుకునేందుకు ఓ కప్పు ఉంటే చాలు అనుకునే దీనపరిస్థితి అతనిది. దీనికోసం పాయఖానానే ఇల్లుగా మార్చుకున్నాడు. ఐదేళ్లుగా ఆ పాయఖానానే అతనికి ఆశ్రయం ఇస్తోంది. 

ఒడిస్సాలో నిరుపేదలకు ప్రభుత్వం బిజు పక్కా ఇల్లు ఇస్తోంది. అయితే ఇతనికి ఆధార్ కార్డ్ లేకపోవడంతో ఇల్లు పొందే అర్హత లేకుండా పోయింది. తన దీనస్థితి వివరిస్తూ తనకో గూడు ఇవ్వమంటూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా  తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో నిరుపయోగంగా పడి ఉన్న పాయఖానాను పడక గదిగా మార్చుకొని అందులోనే ఉంటున్నాడు. 

ఒరిస్సా, రాయగడ జిల్లాలోని బిసంకటక్‌ సమితి పనుగుడ గ్రామంలో త్రినాథ్‌ పాండు అనే అరవై ఏళ్ల వృద్ధుని గాధ ఇది.సమితిలోని కుంభారిధాముని పంచాయతీ దుబాగుడ గ్రామానికి చెందిన పాండుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం భార్య మృతి చెందింది. కొడుకులు తనను ఆదరించకపోవడంతో దిక్కు తోచని స్థితిలో పనుగుడకు చేరుకున్నాడు. 

అక్కడ నిరుపయోగంగా ఉన్న పాయఖానలో తలదాచుకుంటున్నాడు. అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్ముకుంటేనే ఆ పూట గడిచేది. ఇంతటి దీనావస్థలో జీవనాన్ని కొనసాగిస్తున్న పాండుకు ప్రభుత్వం తరుఫున ఎటువంటి సహాయం అందటం లేదు. 

అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ తన వద్ద ఎటువంటి ఆధార్‌ కార్డు, గర్తింపు పత్రాలు లేకపొవడంతో ప్రభుత్వ సహాయాన్ని పొందలేకపోతున్నాడు. ఈ విషయమై బిసంకటక్‌ బీడీవోను ప్రశ్నించగా అతనికి ప్రభుత్వ సహాయం అందేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.