ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఆస్తి ఐదేళ్ల కాలంలో ఐదు రెట్లు పెరిగింది. మరోసారి ఎన్నికల బరిలోకి దిగిన నవీన్ తన ఆస్తుల విలువ రూ.63.87 కోట్లుగా ప్రకటించారు.

ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్‌కు రూ.12 కోట్ల స్థిరాస్తులుండగా 2019 నాటికి ఇవి ఏకంగా రూ.63 కోట్లకు పెరిగాయి.

న్యూఢిల్లీలోని ఏపీజే అబ్ధుల్ కలాం రోడ్డులో రూ.43 కోట్ల విలువగల ఇల్లు నవీన్ పట్నాయక్ పేరిట ఉంది. అలాగే ఒడిశాలోని రూ.9.5 కోట్ల విలువైన మరో ఇల్లు కూడా ఉంది. మరో వైపు ముఖ్యమంత్రి చేతిలో రూ.25 వేల నగదు మాత్రమే ఉందట.

దీంతో పాటు 1980 మోడల్‌కు చెందిన అంబాసిడర్ కారునే ఆయన ఇప్పటికి వాడుతున్నారు.. దీని ప్రస్తుత విలువ రూ.9 వేలేనట. ఈ మేరకు నవీన్ పట్నాయక్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.