పగటిపూట ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతో అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించింది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. అంటే.. ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 16 వరకు మూసివేయాలని ఆదేశించింది.
పగటిపూట ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒడిశాలో ప్రధాన నగరాలైన భువనేశ్వర్లో 40 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా..బారిపద నగరంలో ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్షియస్, జార్సుగూడలో 41.5 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తీవ్రమైన ఎండలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా హీట్‌వేవ్ హెచ్చరికను జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ ప్రకారం..రాబోయే కొద్ది రోజుల్లో భువనేశ్వర్ , కటక్‌లలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని, రాబోయే ఏడు రోజుల పాటు వేడి , తేమ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ పరిస్థితులపై సీఎం సమీక్ష
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రస్తుత హీట్ వేవ్ పరిస్థితి , వివిధ ఆరోగ్య సంబంధిత సౌకర్యాలను సమీక్షించడానికి సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. దీంతో ఏప్రిల్ 12 నుంచి 16 వరకు అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా సజావుగా ఉండేలా చూడాలని, కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే సీఎం నవీన్ పట్నాయక్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సుందర్‌గఢ్, కియోంజర్, మయూర్‌భంజ్, బాలాసోర్, ఝర్సుగూడ, సంబల్‌పూర్, సుందర్‌ఘర్, దేవ్‌ఘర్, అంగుల్ , బౌధ్ వంటి జిల్లాల్లో హీట్‌వేవ్ పరిస్థితుల ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్‌లను కోరారు. పంచాయతీరాజ్ , తాగునీరు, గృహనిర్మాణం , పట్టణాభివృద్ధి , ఇంధనం వంటి శాఖలు ఎలాంటి అత్యవసరమైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధతగా ఉండాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖను కోరారు. ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ యొక్క వివిధ కార్యకలాపాలను సమీక్షిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు మూడున్నర కోట్ల మందికి ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించే బిజు స్వాస్త్య కళ్యాణ్ యోజన పథకం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
