Odisha: తల్లీ, కొడుకులు తోటి విద్యార్థులుగా మెట్రిక్ పరీక్షలు రాస్తున్నారు. అర్ధాంతరంగా ముగించిన చదువును కోవిడ్-19 కారణంగా మళ్లీ తిరిగి ప్రారంభించింది ఆ మహిళ. ఆమె జ్యోస్నా పాధి.. ఇది స్ఫూర్తినిచ్చే ఒడిశా గృహిణి కథ !
Odisha Matric board exams: అర్ధాంతరంగా ముగించిన చదువును కోవిడ్-19 కారణంగా మళ్లీ తిరిగి ప్రారంభించింది ఓ మహిళ. పట్టువదల కుండా చాలా సంత్సరాల తర్వాత మళ్లీ చదువును ప్రారంభించింది. తన కొడుకుతో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరవుతోంది. మధ్యలోనే చదువులు ఆపిన వారికి తిరిగి విద్యను కొనసాగించడానికి వయస్సుతో సంబంధం లేదని చూపుతూ... స్ఫూర్తి నింపుతున్న ఆమె జ్యోస్నా పాధి. తన కొడుకుతో కలిసి పది పరీక్షలు రాస్తోంది. ఒడిశాకు చెందిన ఆమె కథ మీ కోసం... !
ఒడిశాలో శుక్రవారం నాడు మెట్రిక్ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ఒక తల్లి తన కొడుకుతో కలిసి బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. వీరిద్దరు పది పరీక్షలు రాసేందుకు వచ్చారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వివరాల్లోకెళ్తే.. కరోనా కారణంగా విద్యసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇండ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ విద్యను పాఠశాలలు ప్రారంభించాయి. ఒడిశా సర్కారు సైతం ఆన్‌లైన్ లో పాఠాలు ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి మధ్య జ్యోస్నా పాధి (36) తన కొడుకు 10వ తరగతి బోర్డు పరీక్షలకు ఆన్‌లైన్‌లో ఇంటివద్ద నుంచే సిద్ధమవుతున్నాడు.
తన కొడుకు ఇంటి వద్ద నుంచే పదో తరగతి చదువును కొనసాగించడం చూసిన.. జ్యోస్నా పాధి, తాను కూడా అర్ధాంతరంగా ముగించిన చదువును కొనసాగించాలని నిర్ణయించుకుంది. అంతకుముందు 15 ఏండ్ల కిందట వివాహం కారణంగా ఆమె చదువు ఆగిపోయింది. జ్యోస్న కోరాపుట్ జిల్లా గిరిజన ప్రాంతంలోని జైపూర్ బ్లాక్ పరిధిలోని పూజారిపుట్ గ్రామానికి చెందినది. ఆమె భర్త త్రినాథ్ పాత్ర అక్కడే విలేజ్‌లో జాతీయ బ్యాంకు కియోస్క్‌ను నడుపుతున్నాడు. మళ్లీ చదువు కొనసాగించాలనే ఆమె కోరికను గమనించి భర్త.. పాఠశాలలో చెర్పించాడు. ఆమె సహకారం అందించడంతో ఇంటి నుంచే తన కొడుకుతో కలిసి పది పరీక్షలు సిద్ధమైంది. ఇప్పుడు ఇద్దరు కలిసి పరీక్షలకు హాజరవుతున్నారు.
తన కొడుకుతో కలిసి అర్ధాంతరంగా ముగించిన తన చదువును కొనసాగించడం ఆనందంగా ఉందని జ్యోస్న చెప్పారు. తన పెళ్లయిన 15 ఏండ్ల తర్వాత తనకు ఈ అవకాశం వచ్చింది, దానికి నా భర్త కూడా సహకరిస్తున్నారని జ్యోస్న చెప్పారు. "కరోనా లాక్డౌన్ సమయంలో నా కొడుకు తన ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి నా మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లేవాడు. నేను అతని పక్కనే ఉండి, అతను తన క్లాస్‌లో ఏదీ మిస్ కాకుండా అన్ని సమయాలలో అప్రమత్తంగా ఉన్నాను. ఈ క్రమంలోనే నాలో మళ్లీ చదువుకోవాలనే కోరిక" కలిగింది అని చెప్పారు. అయితే, ప్రారంభ రోజుల్లో ఆమె ఇంటి పని మరియు చదువులు రెండింటినీ నిర్వహించడంలో చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంది. కానీ తరువాత ఆమె కుటుంబం సాయం అందించడంతో చదువును ఆటంకం లేకుండా మళ్లీ కొనసాగించింది.
'ఆమె ఉత్సాహం, చదువు పూర్తి చేయాలనే కోరిక చూసి కరెస్పాండెన్స్ కోర్సులో చేర్పించాను. ఆమె నా కొడుకు అలోక్‌నాథ్‌తో కలిసి బోర్డు పరీక్షకు హాజరవడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని ఆమె భర్త చెప్పారు. జ్యోస్న కుమారుడు అలోక్‌నాథ్ మాట్లాడుతూ.. తన అమ్మ కూడా తనతో కలిసి 10వ తరగతి బోర్డు పరీక్షలు రాయడం తనకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు. 'ఈ గొప్ప రోజు కోసం మేమిద్దరం కలిసి సిద్ధమయ్యాం. ఆమె మెట్రిక్యులేషన్ మరియు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను' అని అలోక్‌నాథ్ చెప్పారు. 2002లో ఆమె కుటుంబం ఎదుర్కొన్న సమస్యల కారణంగా, జ్యోస్న పాఠశాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె జేపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (కరస్పాండెన్స్ కోర్సు) పరీక్షకు హాజరవుతుండగా, ఆమె కుమారుడు అలోక్‌నాథ్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.
