పెళ్లికాని యువతి మాంసం తింటే అతీత శక్తులు వస్తాయని నమ్మారు. దాని కోసం చితిలో కాలుతున్న ఓ యువతి  శవాన్ని బయటకు తీసి, ముక్కలుగా కోసి మరీ తిన్నారు.

ఈ రోజుల్లోనూ ముఖ్యంగా టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిన ఈ కాలంలో మూఢనమ్మకాలను వదిలిపెట్టనివారు ఇంకా ఉన్నారనే చెప్పాలి. తాజాగా ఇద్దరు వ్యక్తులు చేసిన పనే దానికి నిదర్శనం. పెళ్లికాని యువతి మాంసం తింటే అతీత శక్తులు వస్తాయని నమ్మారు. దాని కోసం చితిలో కాలుతున్న ఓ యువతి శవాన్ని బయటకు తీసి, ముక్కలుగా కోసి మరీ తిన్నారు. సదరు యవతి కుటుంబ సభ్యులు చూస్తుండగానే వారు ఈ దారుణానికి పాల్పడటం విశేషం.

దీంతో, వారు ఆ ఇద్దరికీ దేహ శుద్ధి చేశారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా గిరిజన ప్రాంతమైన మయూర్ భంజ్ జిల్లాకి చెందిన ఓ యువతి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో, ఆమెకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె చితికి నిప్పు పెట్టి, చితి కాలుతుండగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడం మొదలుపెట్టారు.

ఆ సమయంలోనే ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి, చితిలో కాలుతున్న శవాన్ని బయటకు తీశారు. అదిగమనించిన కుటుంబసభ్యులు వారిని ఏం చేస్తున్నారని ప్రశ్నించినా, వారు సమాధానం చెప్పకుండా శవాన్ని ముక్కులగా చేశారు. రెండు ముక్కలను వారు తీసుకొని, మరో ముక్కను తిరిగి చితిలో వేసేశారు. అనంతరం వారు ఆ ముక్కలను తింటూ, మద్యం తాగుతూ డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు.

అది చూసి యువతి కుటుంబ సభ్యులు షాకైపోయారు. స్థానికుల సహాయంతో ఆ ఇద్దరినీ స్తంబానికి కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వారిద్దరూ అతీత శక్తులు వస్తాయనే నమ్మకంతోనే అలానే చేశామని పోలీసుల ముందుకు అంగీకరించడం గమనార్హం.