షూటింగ్ కోసం భారత్‌కు వచ్చిన బ్రిటన్ నటి బనితా సంధూకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. అయితే ప్రభుత్వాసుపత్రిలో చేరడానికి ఆమె నిరాకరించింది. దీంతో అధికారులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

కవితా అండ్ తెరిసా అనే సినిమా షూటింగ్‌ లో పాల్గొనేందుకు బనితా డిసెంబర్ 20న కోల్‌కతాకు వచ్చారు. అయితే ఆమె ప్రయాణించిన విమానంలోని ఓ యువకుడికి ఇటీవలే  కరోనా స్ట్రెయిన్ బారిన పడ్డట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ విమానంలో ప్రయాణించిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంట్లో భాగంగా బనితా కరోనా బారిన పడ్డట్టు సోమవారం నాడు వెల్లడైంది.

అధికారులు తొలుత ఆమెను బెలియాఘాటా అంటువ్యాధుల ఆస్పత్రికి తరలించారు. బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఆమెకు చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. 

అయితే, బెనితా ఈ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసుతుల లేమి ఉందంటూ అక్కడ చికిత్స తీసుకునేందుకు నిరాకరించారు. ఆంబులెన్స్ నుంచి కిందకు దిగేందుకు కూడా ఆమె అంగీకరించలేదు. 

అక్కడి వైద్యాధికారులు ఎంత నచ్చచెప్పినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో, వారు ప్రభుత్వ హెల్త్ సెక్రెటరీకి సమాచారం అందించి ఆ తరువాత ఆమెను ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. బ్రిటన్‌లో జన్మించిన సంధూ(23) అధిక శాతం భారతీయ సినిమాల్లోనే నటించారు.