తన పుట్టినరోజు నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన సహచరుడు , మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను గుర్తుచేసుకున్నారు . ఆయన ఓ తప్పుడు కేసులో జైలులో వున్నాడని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ సహచరుడు మనీష్ సిసోడియాను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కానీ తాను ఈసారి మనీష్‌ను మిస్ అవుతున్నానని.. ఆయన ఓ తప్పుడు కేసులో జైలులో వున్నాడని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
భారత దేశంలో జన్మించిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందిస్తానని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఇది బలమైన భారతదేశానికి పునాది వేస్తుందని.. మన కలలను సాకారం చేసుకోవడంలో సహాయపడుతుందన్నారు. ఇకపోతే.. కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యంతో వుండాలని ప్రధాని ఆకాంక్షించారు. పలువురు ఆప్ నేతలు, కార్యకర్తలు కూడా కేజ్రీవాల్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
మరోవైపు.. కేజ్రీవాల్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన సొంత పార్టీ నాయకుడే బట్టబయలు చేశారు. అది కూడా ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా.. ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఆప్ ఎమ్మెల్యే భూపిందర్ సింగ్ జూన్ ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా ఢిల్లీ జల్ బోర్డు పనులు పూర్తిగా నిలిచిపోయాయని.. ప్రజలు మురికి నీరు, దుర్వాసనతో కూడిన నీరు తాగాల్సి వస్తోందని అన్నారు. స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఢిల్లీ జల్ బోర్డు వద్ద డబ్బులు లేవని చెప్పారు.
ఢిల్లీ ప్రజలు మురికి నీరు, దుర్వాసనతో కూడిన నీరు తాగాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించి జల్ బోర్డు అధికారులతో మాట్లాడితే.. ఫండ్స్ లేవనే ఒకే ఒక్క సమాధానం వినిపిస్తుంది. దీంతో జనాలు రోగాల బారిన పడుతున్నారు’’ అని భూపిందర్ సింగ్ జూన్ చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేస్తున్న పలువురు.. ఆప్ ఎమ్మెల్యే మాటలతో ఢిల్లీ మోడల్ అంటూ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనేది తేలిందని కామెంట్స్ చేస్తున్నారు.
