కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ బీజేపీపై విమర్శలు సంధించారు. ఒమిక్రాన్ కంటే.. ఓ మిత్రోన్ చాలా డేంజర్ వైరస్ అని ఆయన ప్రధాని మోడీకి చురకలు అంటించారు. ఓ మిత్రోన్ దుష్పరిణామాలను తాము రోజూ చూస్తున్నామని పేర్కొన్నారు. ఓ మిత్రోన్ వైరస్‌కు అసలు మైల్డ్ వేరియంట్ లేనే లేదని వివరించారు. శశిథరూర్ ఇటీవలే బీజేపీపై వరుసుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్ శశిథరూర్(Shashi Tharoor) బీజేపీ(BJP)పై విరుచుకుపడ్డారు. ఇటీవలి కాలంలో ఆయన తన విమర్శలకు పదును పెడుతున్నారు. ఈ రోజు అంటే జనవరి 31వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) తన ప్రసంగాల్లో తరుచూ ఉపయోగించే మిత్రోన్ పదాన్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేశారు. ఓ మిత్రోన్(O Mitron) అనేది ఒమిక్రాన్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనదని విమర్శించారు.

ఒమిక్రాన్ కంటే.. ఓ మిత్రోన్ చాలా డేంజర్ అని ఆయన ట్వీట్ చేశారు. ఓ మిత్రోన్ వల్ల కలిగే దుష్పరిణామాలను తాము రోజూ చూస్తున్నామని వివరించారు. విద్వేషం, మతోన్మాదాన్ని ఎగదోయం, విభజన చేయడం, రాజ్యాంగంపై పరోక్షంగా దాడి చేయడం, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడంలో ఈ ఓ మిత్రోన్ ప్రభావాన్ని స్పష్టంగా చూస్తున్నామని విమర్శించారు. ఈ వైరస్‌కు స్వల్ప తీవ్రత కలిగిన వేరియంట్ లేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై బీజేపీ ప్రతినిధి షెహెజాద్ పూనావాలా రియాక్ట్ అయ్యారు. దేశంలో ఒక వైపు కరోనా వైరస్ తీవ్ర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, కానీ, వాటిని తేలిక పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కొవిడ్ మహమ్మారి గురించి రాహుల్ గాంధీ తరుచూ గంభీరంగా మాట్లాడుతారని పేర్కొన్నారు. కానీ, వాస్తవంగా ఇంతటి తీవ్రమైన మహమ్మారిని కాంగ్రెస్ పార్టీ చిన్నదిగా చూపేలా మాట్లాడుతున్నదని ప్రతి విమర్శ చేశారు.

తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కొన్నాళ్లుగా బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు మొదలుపెట్టారు. బీజేపీపై, దాని నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై కామెంట్లు పేల్చారు. అసలు ఆయన ఎంత నష్టం చేశాడో ఆయనకే తెలియదని ట్వీట్ చేశారు. ఈ దేశాన్ని స్మశానం చేశారని విమర్శించారు. గంగా జమునా తెహజీబ్‌ల ఔన్నత్యాన్ని అవమానపరిచారని తెలిపారు. అన్నదమ్ములను ఈయన హిందువు, ముస్లింలు అని విడగొట్టాడని విమర్శించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కరోనాతో మరణించిన పేషెంట్ల మృతదేహాలు స్మశానాల ముందు బారులు తీరాయి. గంగా నదీ తీరంలోనూ మృతదేహాలు వెలికి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

కాగా, ఈ నెల 26వ తేదీన ఆయన బీజేపీపై ఘాటుగా కామెంట్ చేశారు. ఆయన కాంగ్రెస్ యుక్త్ అనే పదాన్ని వినియోగించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే... కాంగ్రెస్ ఉన్న చోట్ల బీజేపీ అధికారంలోకి రావాలనేది ఆయన ఉద్దేశ్యం. ఈ కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే పదాన్ని శశిథరూర్ కాంగ్రెస్ యుక్త్‌ బీజేపీగా మార్చి వ్యంగ్యంగా బీజేపీపై సంధించారు. 

కొంత మంది తమ ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారని, వారికి ఇంకొన్ని కలలు మిగిలి ఉండవచ్చునని, కానీ, అక్కడికి పోయిన తర్వాత కూడా అక్కడంతా మనదే అన్నట్టుగా ఉన్నదని ఓ కవిత రీతిలో ఆయన హిందీలో ట్వీట్ చేశారు. అలా ఎందుకు అనిపించి ఉంటుందంటే.. అక్కడ కూడా అంతా మన వారే కదా.. అంటూ ముగించారు. అదే ట్వీట్‌లో బ్రాకెట్‌లో కాంగ్రెస్ యుక్త్ బీజేపీ అని కౌంటర్ ఇచ్చారు.