చెన్నై: తమిళనాడులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. విస్తుపోయే విధంగా ఓ నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి దెయ్యమే కారణమని ఆమె తన సూసైడ్ నోట్ లో రాసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

డిండుక్కల్ జిల్లా వేడచండూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్ారు. పెద్ద కూతురు కోయంబత్తూర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండో నర్సింగ్ చేస్తోంది. 

లాక్ డౌన్ కారణంగా ఆమె ఇంటికి వచ్చింది. రెండు రోజుల క్రితం ఆమె తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అప్పటి నుంచి ఆమె ఇతరులతో మాట్లాడడం మానేసింది. శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె గదిని సోదా చేశారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన నోట్ వారికి లభించింది. రాత్రుళ్లు నిద్రపట్టడం లేదని, మరణించేందుకు రావాలని తనను పిలుస్తున్నట్లుగా ఉందని ఆమె రాసింది. 

అంతేకాకుండా ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తానని దెయ్యం తనను భయపెడుతుందని ఆమె ఆ లేఖలో రాసింది.