Nupur Sharma Row: బీజేపీ బహిష్కృత నేత‌ నుపుర్ శర్మ వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న త‌రువాత భారత్‌పై సైబర్ వార్ ప్రారంభమైనట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ వెల్ల‌డించింది. ఇండోనేషియాకు చెందిన రెండు హ్యాకర్ల గ్రూపులు భారతదేశంలో సైబర్ దాడి చేస్తున్న‌ట్టు గుర్తించింది. 

Nupur Sharma Row: ప్రవక్త మ‌హమ్మద్‌పై బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శర్మ వివాదాస్పద ప్రకటన పై ఇప్పటికీ ప‌లు చోట్ల నిర‌స‌న‌లు వెల్లువెత్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తునే ఉన్నాయి. ఈ స‌మ‌యంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ షాకింగ్ విషయాల‌ను వెల్ల‌డించింది. నుపుర్ శర్మ వివాద‌స్ప‌ద ప్ర‌క‌ట‌న‌ తర్వాత ఇండోనేషియాకు చెందిన 'డ్రాగన్ ఫోర్స్ మలేషియా, 'హాక్టివిస్ట్ ఇండోనేషియా' అనే రెండు హ్యాకర్ గ్రూపులు భారత్‌పై సైబర్ వార్ ప్రారంభించాయని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఇండోనేషియాకు చెందిన ఈ హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం హ్యాకర్లు స‌పోర్టు చేస్తున్న‌ట్టు క్రైమ్ బ్రాంచ్ వెల్ల‌డించింది.

ఇండోనేషియా-మలేషియా ప్రభుత్వానికి క్రైమ్ బ్రాంచ్ లేఖ 

ఈ హ్యాకర్ల గ్రూప్ రెండు వేలకు పైగా వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అమిత్ వాసవ తెలిపారు. ఈ మేరకు మలేషియా, ఇండోనేషియా ప్రభుత్వానికి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ లేఖ రాసింది. లేఖలో.. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ రెండు గ్రూపులకు ఇంటర్‌పోల్ లుకౌట్ నోటీసుల అంశాన్ని కూడా ప్రస్తావించింది. నూపుర్ శర్మ వివాదాస్పద ప్రకటన తర్వాత ఇదంతా జరుగుతోందని క్రైమ్ బ్రాంచ్ చెబుతోంది.

నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

మహ్మద్ ప్రవక్త గురించి నూపుర్ శర్మ వివాదాస్పద ప్రకటన తర్వాత.. దేశవ్యాప్తంగా నిరసనలు, వ‌రుస‌ హత్యలు జరుగుతున్న విష‌యం తెలిసిందే. మహారాష్ట్రలోని అమ‌రావ‌తిలో ఉమేష్ కోల్హే అనే మెడిక‌ల్ వ్యాపారి హత్యకు గురి కాక‌.. రాజస్థాన్‌లోని ఉద‌య్ పూర్ లో ఒక టైలర్ కూడా హత్యకు గురయ్యాడు. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో నూపుర్ శర్మపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అదే త‌రుణంలో AIMIM అధినేత‌ అసద్దుదీన్ ఒవైసీ, TMC అధినేత్రి మమతా బెనర్జీ వంటి చాలా మంది నాయకులు ఆమెను అరెస్టు చేయాలని కోరారు.

దీనిపై నూపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 
విచారణ సందర్భంగా.. న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శర్మపై తీవ్రంగా విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లకు నూపుర్ శర్మనే కారణమని, ఆమె దేశానికి బ‌హిరంగ‌ క్షమాపణ చెప్పాలని పేర్కొంది.