బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా పలు రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీలోనే క్లబ్ చేయాని కోరారు. తనపై సుప్రీంకోర్టు చేసిన విమర్శల తర్వాత తనకు ముప్పు మరింత పెరిగిందని పేర్కొన్నారు. 

న్యూఢిల్లీ: బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ ఇవ్వాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే విధంగా ఆమె ఇటీవలే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చేసిన విమర్శలతో తనకు ముప్పు ఇంకా పెరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు విమర్శల తర్వాత రేప్, హత్య బెదిరింపులు ఎక్కువ అయ్యాయని వివరించారు.

గతంలో సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించి పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్లబ్ చేయాలని, వాటిని ఢిల్లీలోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. కానీ, సుప్రీంకోర్టు అందుకు అంగీకరించకపోవడమే కాదు.. నుపుర్ శర్మపై సీరియస్ అయింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ధర్మాసనం నుపుర్ శర్మపై మండిపడింది. దేశంలో ఇంత ఆందోళనలు చెలరేగడానికి కేవలం నుపుర్ శర్మనే ఏకైక కారణం అని ఆగ్రహించింది. టీవీ చానెల్‌ డిబేట్‌లో ఆమె ఏ విధంగా రెచ్చగొట్టిందో చూశామని, అన్నీ చేసి చివరకు తాను న్యాయవాది అని పేర్కొనడం సిగ్గు చేట అని జస్టిస్ జేబీ పర్దివాలా అన్నారు. ఆమె దేశానికి క్షమాపణలు చెప్పాలని, ఉదయ్‌పూర్ హత్యకూ ఆమెదే బాధ్యత అని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులపైనా మండిపడింది. వేరే వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగానే అరెస్టు చేసే పోలీసులు ఇప్పటికీ నుపుర్ శర్మను ఎందుకు టచ్ చేయలేదని నిలదీసింది.

నుపుర్ శర్మ సోమవారం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా పలు రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల్లో అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని ఆమె పిటిషన్ వేశారు. అలాగే, జులై 1వ తేదీన తనపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టు తనపై విమర్శలు చేసిన తర్వాత రేప్, డెత్ త్రెట్స్ మరింత పెరిగాయని పేర్కొన్నారు. అలాగే, తనపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఢిల్లీలో క్లబ్ చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌ను కూడా తనపై విమర్శలు చేసిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలా ధర్మాసనం విచారించనుండటం గమనార్హం.