Asianet News TeluguAsianet News Telugu

రేపే నీట్ పరీక్ష.. 16 లక్షల మంది విద్యార్థులు హాజరు!

పరీక్ష పత్రాల లీక్‌ ఆరోపణలు సంచలనం రేపినప్పటకీ నీట్ పరీక్ష నిర్వహించడంపై అధికారులు వెనుకంజ వేయలేదు. ఆ ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. రేపు దేశవ్యాప్తంగా మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఇందులో సుమారు 16 లక్షల విద్యార్థులు హాజరుకానున్నా

NTA to conduct NEET tomorrow, around 16 lakh students to appear
Author
New Delhi, First Published Sep 11, 2021, 7:09 PM IST

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) 2021 రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా ఆదివారం(సెప్టెంబర్ 12న) ఎన్‌టీఏ నిర్వహించనుంది. పరీక్షకు రెండు రోజుల ముందు పరీక్షపేపర్ లీక్‌పై ఆరోపణలు సంచలనం రేపాయి. కానీ, ఆ ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. కరోనా కారణంగా పరీక్షను వాయిదా వేయాలని స్టూడెంట్లు చాన్నాళ్ల నుంచి డిమాండ్ చేస్తున్న ప్రకటించిన షెడ్యూల్‌కే పరీక్ష జరుగుతున్నది. ఆదివారం తొలిసారిగా 13 భాషల్లో నీట్ జరగనుంది. ఈ పరీక్షకు సుమారు 16.1 లక్షల మంది హాజరవ్వనున్నట్టు అంచనా.

నీట్ క్లియర్ చేసిన విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, ఇతర మెడికల్, డెంటల్ కోర్సులు చేయడానికి అర్హత సంపాదిస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 202 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

హాల్ పాస్‌పై విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. రెండో పేజీలో పాస్‌పోర్టు సైజు ఫొటో పేస్టు చేయడంపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. దీంతో ఎన్‌టీఏ మరోసారి స్పష్టతనిచ్చింది. ఇప్పటికే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్నవారు మరోసారి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా 9వ తేదీన సూచించింది. విద్యార్థులు ఫేస్ మాస్క్, గ్లవ్స్, హ్యాండ్ శానిటైజర్లు, ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిళ్లను ఎగ్జామినేషన్ హాల్‌లోకి తీసుకెళ్లవచ్చని తెలిపింది. కానీ, ఎలక్ట్రానిక్ డివైజులు, ఇతర అనుమానాస్పద వస్తువులను తీసుకెళ్లవద్దని పేర్కొంది.

నిజానికి ఏప్రిల్ 18న ఈ పరీక్ష జరగాల్సింది. కానీ, కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ తాజా షెడ్యూల్‌నూ ఇంకొంత కాలం వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు. కానీ, వాయిదా వేయాలన్న వాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో రేపు పరీక్ష జరగడం ఖరారైంది.

Follow Us:
Download App:
  • android
  • ios