జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో అక్కడి తాజా పరిస్థిని సమీక్షించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కశ్మీర్‌లో మకాం వేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన స్థానికులతో సమావేశమై, వారితో భోజనం చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. కాగా.. శనివారం ధోవల్ అనంత్ నాగ్ జిల్లాలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ రోడ్డుపై వెళుతుండగా మధ్యలో ఓ గొర్రెల దుకాణాన్ని చూపి అజిత్ ధోవల్ కిందకు దిగి గొర్రెల కాపరులతో ముచ్చటించారు.

గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ధోవల్ ఎవరో తెలియని సదరు గొర్రెల కాపరి తాను గొర్రెలను కార్గిల్ సెక్టార్‌లోని ద్రాస్ నుంచి కొనుగోలు చేశానని వివరించాడు.

అయితే ఈ ద్రాస్ ప్రాంతం ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా అని ధోవల్‌ను గొర్రెల కాపరి ప్రశ్నించగా.. అనంత్‌నాగ్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ మధ్యలో కలగజేసుకుని ధోవల్ ఎవరో అతనికి వివరించారు. అనంతరం కరచాలనం చేసి ధోవల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.