ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో రొట్టేల్ని తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై ఏకంగా జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయబోతున్నారు. రొట్టేల్ని తయారు చేయడం తప్పా.. అంత మాత్రానికే ఎన్ఎస్ఏ కింద కేసు పెడతారా అనే డౌట్ మీకు రావొచ్చు.

అసలు మేటర్‌లోకి వెళితే... మీరట్‌లోని లిషారీ గేట్, అరోమా గార్డెన్‌లో ఫిబ్రవరి 16న ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి విందుకు హాజరయ్యే అతిథుల కోసం నౌషాద్ అనే వ్యక్తి రొట్టెల్ని తయారు చేశాడు.

నౌషాద్ ప్రతి రొట్టెపైన ఉమ్మివేసి, ఆ తర్వాత తందూర్‌లో కాల్చుతున్న విషయాన్ని ఓ వ్యక్తి గమనించాడు. ఈ తతంగాన్ని అతను వీడియో తీసి, ఇతర అతిథులకు కూడా చూపించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

నౌషాద్ అత్యంత అసహ్యకరంగా రొట్టెలు తయారు చేస్తున్నాడని, కరోనా విజృంభణ నేపథ్యంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని తెలుసుకున్న అతిథులు విందు భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు. 

దీనిపై సామాజిక కార్యకర్త సచిన్ సిరోహీ, మరికొందరు కలిసి లాలా లజపతి రాయ్ మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నౌషాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి, నౌషాద్‌ను అరెస్టు చేశారు. అతనిపై అంటువ్యాధుల నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. నౌషాద్ జైలు నుంచి బయటకు వస్తే, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశంతో పాలు అల్లర్లు జరగవచ్చనే అనుమానంతో ఆయనపై జాతీయ భద్రత చట్టం క్రింద కేసు నమోదు చేశామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోనే ఘజియాబాద్‌లో మరో కుక్ కూడా ఇదే విధంగా ప్రతి రొట్టెపైనా ఉమ్మివేసి, ఆ తర్వాత వాటిని కాల్చుతున్నట్లు కేసు నమోదైంది. మీరట్ పోలీసుల స్పూర్తితో ఇతనిపై కూడా ఎన్ఎస్ఏ ప్రకారం కేసు నమోదు చేసేందుకు ఘజియాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.